Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గౌరవెల్లి' ఘటనపై సీపీఐ నేత నారాయణ
- ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
- బీజేపీని వ్యతిరేకించే కేసీఆర్‌కు రహస్య ఎజెండా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిర్వాసితుల సమస్యను పరిష్కరించకుండా గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను నిర్మించడం మంచిది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేయాలనీ, వారు సంతృప్తి చెందితే తమకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోనే నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే హామీనిచ్చి, ఇప్పుడు వారిని పోలీసులతో కొట్టించడం మంచి పద్ధతి కాదని చెప్పారు. ఆ ఎమ్మెల్యే తన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు పేరును చెడగొడుతున్నారని విమర్శించారు. నిర్వాసితులను తాము రెచ్చగొట్టడం లేదనీ, వారికి అన్యాయం జరిగిందనీ, రోడ్ల మీదకు వస్తే, తాము వారికి మద్దతుగా నిలుస్తున్నామని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్దకు, నిర్వాసితులను కలిసేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమనీ, ఆ ప్రాంతం పాకిస్తాన్లో లేదు? కదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యతిరేకిగా గావు కేకలు పెట్టే సీఎం కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్ష రాజకీయ పార్టీల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ 'డబుల్ మైండ్' బయటపడిందనీ, ఆయనకు ఒక రహస్య ఎజెండా ఉన్నదని విమర్శించారు. బాసర త్రిపుల్‌ఐటీ విద్యార్థులకు జైలు భోజనం కంటే అన్యాయంగా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించకుండా సీఎం, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారని అడిగారు.