Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులుంటే కఠిన చర్యలు
- సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యం తగదు
- గృహకార్మికుల అంతర్జాతీయ దినోత్సవంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'గృహ కార్మికులకు గుర్తింపు కావాలి. వారికి గౌరవం లేదు. ఇంటి పని కూడా శ్రమే..' కాబట్టి వారి కష్టాన్ని గుర్తించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిస్టర్ లిజ్జి జోసెఫ్ అధ్యక్షతన అంతర్జాతీయ గృహకార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గృహకార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. గృహకార్మికుల సేవ వెలకట్టలేని తెలిపారు.కోవిడ్ కాలంలో వారు మరింత దుర్భర జీవితాలను అనుభవించారని గుర్తుచేసుకున్నారు. వారు పురుషులతో తీసిపోని విధంగా పనిచేస్తున్నారనీ, అందుకే సమాన పనికి సమాన వేతనం కావాలని కోరడం సమంజసమేనన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేదింపులు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మానవ హక్కుల వేదిక జీవన్ కుమార్ మాట్లాడుతూ ఇండ్లలో పనిచేసే కార్మికుల వేతనం 60శాతం మేర ఇంటి కిరాయిలకే పోతున్నదని చెప్పారు. మిగిలిన 40శాతం డబ్బులతో విద్య, వైద్యంతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తట్టుకుని కుటుంబాన్ని ఎలా నడపగలరని ప్రశ్నించారు. ప్రతి మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు.
కానీ..సర్కారు ఆ వైపు దృష్టి పెట్టటం లేదని విమర్శించారు.ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి సంధ్య మాట్లాడుతూ గృహ కార్మికుల కోసం 2008లో బిల్లు పెట్టారని చెప్పారు. కానీ..ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఝాన్సీ మాట్లాడుతూ గృహకార్మికులంతా సమాజంలో అణగారిని వారని చెప్పారు. వారికి తగిన గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ జేఏసీ కన్వీనర్ సజయ,భూమిక ఎడిటర్ కె సత్యవతితోపాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళా నాయకులు ఆశాలత,ఉషాసీతాలక్ష్మి, సరోజ, ఐఎఫ్టీయూ అరుణ, ఇందిర తదితరులు ప్రసంగించారు.