Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ హెచ్చరిక
- అధికారుల బెదిరింపులపై ఆగ్రహం
- విద్యాశాఖ మంత్రి కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం
- ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే 'చలో బాసర'కు పిలుపునిస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సమస్యలు పరిష్కరించాలని గురువారం విద్యార్థులు పెద్దఎత్తున విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముట్టడి చేపట్టారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు తమ సమస్యలు పరిష్కరించాలని మూడ్రోజులుగా ఆందోళన చేస్తున్నారని చెప్పారు. పరిష్కరించాల్సిన ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి విద్యార్థుల నిరసనపై అసమ్మతి కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్విట్టర్లో స్పందించడం తప్ప విద్యార్దులను కలిసి వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్ధుల పట్ల ప్రభుత్వం, పోలీసులు బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పూర్తిస్థాయిలో వైస్ చాన్స్‌లర్‌ను నియమించలేదన్నారు. రాష్ట్రంలోని వారికిగాకుండా తమిళనాడు వారికి మెస్ కాంట్రాక్టు ఇచ్చారని, నాణ్యమైన భోజనం అందించడం లేదని చెప్పారు. ఏటా 1500 అడ్మిషన్స్ జరుగుతున్నాయని, ఆరు వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారని, సరైన హాస్టల్ వసతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెనోవేషన్ చేయించడానికి కనీసం నిధులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. టెక్నాలజీ విద్యను చదవడానికి గతంలో ల్యాప్‌టాప్‌లు ఇచ్చారని, ఇప్పుడు కనీసం లైబ్రరీ సౌకర్యం కూడా లేని ఆవేదన వ్యక్తం చేశారు. అవసమైన టైటిల్స్ ఇవ్వలేదన్నారు. తాగునీరు, ఇతర సౌకర్యాలు సరిగ్గా ఉండటం లేదన్నారు.
257 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాల్సిన యూనివర్సిటీలో 15 మంది ఉంటే చదవెట్లా సాగుతుందని ప్రశ్నించారు. ఇటువంటి సమస్యలు పరిష్కరించకుండా, వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించలేదని చెప్పారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను బెదిరింపులకు గురిచేయడం, నీళ్లు బంద్ చేయడం, వర్సిటీ లోపల పోలీసులను మోహరించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య హక్కులు హరించేలా ఇంటర్నెట్ బంద్ చేయడం, తల్లిదండ్రులను లోపలికి అనుమతించకపోవడం, విద్యార్థులను బెదిరించడం లాంటి దుర్మార్గపు చర్యలకు అధికారులు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, అశోక్‌రెడ్డి, నగర నాయకులు శేఖర్, అభిమన్యు, లిఖిత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.