Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంటి పనివారిని కార్మికులుగా గుర్తించినా..వారికి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని స్నేహ ఇంటి పనివారల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కెఎన్ ఆశాలత ప్రభుత్వాన్ని విమర్శించారు. గృహకార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు ఆ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. 2011లో అంతర్జాతీయ గృహ కార్మికుల రక్షణ కోసం ఐఎల్ఓ కన్వెన్షన్ సి189-చట్టాన్ని ఆమోదించిందని తెలిపారు.నాటి నుంచి అనేక దేశాలు ఇంటి పనివారికి రక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే మన రాష్ట్రంలో ఇంటి పనిచేసే గృహ కార్మికుల పరిస్థితి మారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 12లక్షల మంది గృహకార్మికులున్నారని పేర్కొన్నారు. వారందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రసూతి సౌకర్యాలు, పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదనపు పనికి అదనపు కూలి ఇవ్వాలనీ, ఇంటి పనివాళ్లపై వేధింపులు, అవమానాలు అరికట్టాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎం వినోద,శశికళ,ఎ మహేశ్వరీ,పద్మ, లావణ్య,గీత తదితరులు కార్యక్రమంలో ఉన్నారు.