Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం కూడగడతాం :
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా గుడిసె వాసులపై నిర్బంధం అపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంఘీభావం ఉద్యమాన్ని లేవదీస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు హెచ్చరించారు. గుడిసె వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం రూ.5.50 లక్షలివ్వాలని కోరారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుడిసెవాసులపై పోలీసుల దాడులు దారుణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాట తప్పడంతోనే పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ మాట్లాడుతూ..పోలీసులు గుడిసె వాసుల వాహనాలను సీజ్ చేయడంతో పాటు మహిళలను బ్రోతల్ కేసుల్లో, యువకులను గంజాయి కేసుల్లో ఇరికిస్తామనీ, పీడీయాక్టులు తెరిపిస్తామని బెదిరింపు చర్యలకు పూనుకోవడం దారుణమని విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసు అధికారులను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతు రాంబాబు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు బందు సాయిలు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, మల్లేశ్, దాసు, తాళ్లపల్లి కృష్ణ, కె.నాగేశ్వరావు, జానకీరాములు, లంకా రాఘవులు, సాంబరాజు సారయ్య, సంపత్ సుంకర, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళ నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ పాల్గొన్నారు.