Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలల ప్రాజెక్టులో కడతేరని విషాదం
- సర్కార్ కర్కశంతో నిర్వాసితుల ఆర్తనాదాలు
- అందని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ
- పోలీసులు, అధికారపార్టీ దాడులు
నవతెలంగాణ-హుస్నాబాద్
గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ.. రైతుల్లో భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తూ.. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం ఆగుతూ సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కొత్తగా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. గౌరవెల్లి ప్రాజెక్టుకు 2007లో శంకుస్థాపన జరిగింది. అప్పుడు 1.4 టీఎంసీల సామర్ధ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మించతలపెట్టారు. ముంపు ప్రాంతం ఎక్కువగా ఉండకుండా, మెట్టప్రాంతాలన్నిం టికీ నీళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందించారు. అప్పుడు ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపులో ఉంది. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. గుడాటిపల్లితో పాటు తెనుగుపల్లి, మద్దెలపల్లి, సోమాజీతండా, సేవానాయక్ తండా, బొంద్యానాయక్ తండా, జాలుబారు తండా, చింతల్ తండా, తిరుమల్ తండా, కొత్తపల్లి మునిగిపోయాయి. దాదాపు 3 వేల ఎకరాల భూమి మునిగిపోగా, 3 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
పరిహారం ఇవ్వకుండానే పనులు..
గతేడాది ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగడంతో డిసెంబరు నుంచి నిర్వాసితులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇటీవల గౌరవెల్లి జలాశయం కట్టపై ఉన్న దారులను మూసివేసే ప్రయత్నం చేయడం, పంపుహౌస్‌లో మోటార్లను బిగిస్తున్నా మని చెప్పడం, ఈ నెల 12వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు ప్రకటించడంతో నిర్వాసితులు ఆందోళనలను ఉధృతం చేశారు. పాత డిజైన్ 1.4 టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించి 2016లో పునరావాస ప్యాకేజీ గెజిట్ లిస్టులో 110 మంది పేర్లు తప్పిపోయాయని, వారికి ప్యాకేజీ ఇవ్వలేదని నిర్వాసితులు చెబుతున్నారు. ఇంకా 23 ఇండ్లకు, 2 పశువుల కొట్టాలకు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా, 2010లో సేకరించిన ఇండ్ల అడుగు స్థలాల డబ్బులు, ఇప్పటివరకు 18 ఏండ్లు నిండిన సుమారు 550 మంది యువతీయువకులకు పునరావాస పునరుపాధి ఇవ్వలేదంటున్నారు. నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా, ఇంకా కొంత భూమికి పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొత్త డిజైన్ 8.4 టీఎంసీ సామర్థ్యానికి సంబంధించిన 85 ఎకరాల భూమికి పరిహారం ఇవ్వలేదని, 106 ఇండ్లలో ఉన్న గిరిజనులకు పునరావాస పునరుపాధి ఇవ్వలేదంటున్నారు. తొలుత ప్రాజెక్టు డిజైన్ చేసిన సమయంలో భూములు కోల్పోయిన వారికి అప్పటి సర్కారు ఎకరాకు రూ.2.10లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఆ డబ్బులతో ప్రాజెక్టు పైభాగంలో భూములు కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచడంతో ఆ భూములూ కోల్పోవాల్సి వచ్చింది. అయితే, గతంలో ఇచ్చిన పరిహారంతోనే భూములు దొరకని పరిస్థితి నెలకొనగా, ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా ఎకరా రూ.30లక్షల వరకు పలుకుతుండటం, సర్కారు ఇచ్చే పరిహారం అందులో సగం కూడా లేకపోవడం వారిని మానసికంగా కుంగదీస్తోంది. ఇంతవరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. కనీసం ఇండ్ల స్థలాలూ ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లూ చూపలేదు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పనులు చేపట్టవద్దని హైకోర్టు కూడా స్టే విధించింది. దాంతో నీళ్లను ఎత్తిపోసి కాల్వల ద్వారా అందించేందుకు అధికారులు సిద్ధం కాగా, తమకు పరిహారం ఇచ్చేదాకా పనులు చేయవద్దని నిర్వాసితులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం వేకువజామున సుమారు 500 మంది పోలీసులు గుడాటిపల్లిని చుట్టుముట్టి, ఇండ్లలో చొచ్చి నిద్రపోతున్న వారిని ఈడ్చుకొచ్చి కొట్టారు. ఆడామగా తేడా లేకుండా విచక్షణారహితంగా కొడుతూ వాహనాల్లో తోసిపడేశారు. దాంతో గుడాటిపల్లితోపాటు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల నుంచి నిర్వాసితులు తరలివచ్చి హుస్నాబాద్‌లో ఆందోళనలు చేపట్టారు. ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తల కవ్వింపు చర్యలతో చెలరేగిన గొడవ పోలీసుల లాఠీచార్జికి దారితీసింది. ముగ్గురు నిర్వాసిత మహిళలకు తీవ్ర గాయాలు కాగా వారు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది యువకులను పోలీసులు కర్రలు, ఇనుప పైపులతో కొట్టారు.
కొనుక్కున్న భూమీ పోయింది..:నల్ల అనసూయ, గుడాటిపల్లి
కాంగ్రెస్ సర్కారోళ్లు మొదట కట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు కింద మా పదెకరాల భూమి మునిగి పోయింది. అప్పుడు ఎకరానికి రూ.2.10లక్షల చొప్పున పరిహారాన్ని ఇచ్చారు. ఆ డబ్బులతో అప్పుడు ప్రాజెక్టు పైభాగంలోని గ్రామంలో 5 ఎకరాలు కొనుక్కున్నం. కేసీఆర్ వచ్చినక ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో మేం కొనుక్కున్న భూమి కూడా మునిగిపోయింది. ఇప్పుడు పరిహారమడిగితే పోలీసోళ్లు చావబాదిండ్రు.
మా ప్రాణం తీయాల్ననే భూములిచ్చినమా..:నోముల అనిత, గుడాటిపల్లి
గౌరవెల్లి ప్రాజెక్టు మొదటి డిజైన్‌లో మా భూమి ఎనిమిదెకరాలు పోయింది. కేసీఆర్ వచ్చినక ప్రాజెక్టును పెంచడంతో మళ్లీ రెండెకరాలు మునిగిపోయింది. మొదట్లో ఎకరానికి రూ. 2.10లక్షలు పరిహారం ఇవ్వగా, వాటితో ఎకరం భూమి కూడా రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఎకరానికి రూ.30లక్షల నుంచి రూ.50లక్షలకు పైగా ధర ఉంది. మాకు చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం ఇవ్వాలని అడిగితే టీఆర్ఎస్ సర్కార్ పోలీసోళ్లతో కొట్టిస్తంది.
మమ్మల్ని ఆగంజేసిండ్రు: బద్ధం రాజిరెడ్డి, సర్పంచి, గుడాటిపల్లి
కొండపోచమ్మ సాగర్ కింద భూములు కోల్పోయిన వారికి 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించారు. 18ఏండ్లు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.8లక్షల చొప్పున ఇచ్చారు. కుటుంబానికి 200 గజాల స్థలాన్ని ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లనూ కేటాయించారు. అది సీఎం కేసీఆర్ నియోజకవర్గం కావడంతో సకల సదుపాయాలూ కల్పించారు. మాకేమో చేతిల మన్నుపోసి రోడ్డున పడేశారు. మా బతుకులను ఆగంజేశారు.
నిర్వాసితులకు అండగా ఉంటాం
నిర్వాసితులపై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు దాడి చేయడం దుర్మార్గపు చర్య. వారిని కఠినంగా శిక్షించాలి. ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగం వెలకట్ట లేనిది. ప్రాజెక్టులు దేవాలయాలు, నిర్వాసితులు దేవుళ్లు అంటూ కీర్తించే సీఎం కేసీఆర్ ఆ ఘటనపై నైతిక బాధ్యత వహించాలి. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందించాలి. నిర్వాసితులకు రావాల్సిన పరిహారాన్ని ఇచ్చాకే ప్రాజెక్టు పనులు చేయాలి. అప్పటిదాకా నిర్వాసితులకు అండగా ఉంటూ పోరాడతాం.
-మల్లారెడ్డి, సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి
నిర్వాసితులందరికీ పరిహారం అందుతోంది
ఇప్పటి వరకు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 97.82 శాతం మందికి పరిహారం అందింది. ఇంకా 2.18 శాతం మందికి మాత్రమే మిగిలి ఉంది. 2011లో ప్రాజెక్టు పాత డిజైన్ 1.4 టీఎంసీ కింద 1814.33 ఎకరాల భూమి సేకరణ కోసం రూ.38.11 కోట్లు చెల్లించాం. కొత్త డిజైన్ 8.23 టీఎంసీ కింద 2055.17 ఎకరాల భూమి సేకరణ అవసరం కాగా, ఇందులో 1971.10 ఎకరాల భూమికి రూ.159.96 కోట్లు చెల్లించాం. 2017 నుంచి ఎకరాకు రూ. 6.95 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు భూసేకరణ జరిగింది. మిగిలిన 84.07 ఎకరాల భూమికి ప్రభుత్వం నుంచి డబ్బులు మంజూరైనా, ఆ భూములకు సంబంధించిన రైతులు పరిహారం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ.15 లక్షల పరిహారాన్ని ఇస్తామన్నా రైతులు ముందుకు రావడంలేదు. ప్రాజెక్టు కింద 693 ఇండ్లు ముంపునకు గురి అవుతుండగా, 683 ఇండ్లుకు రూ.83 కోట్లు చెల్లించాం. మిగిలిన 10 ఇండ్లలో 5 ఇండ్లు కుటుంబ తగాదాలు, 5 ఇండ్లకు రీ సర్వే చేయాలని నిర్వాసితులు కోరడంతో పరిహారాన్ని ఇవ్వలేదు. ఇక, 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ రూ.8 లక్షలు ఇస్తున్నాం.
- వొడితల సతీశ్ కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్