Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలు బోగీలు, ఇంజిన్లు దగ్దం
- 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా నిరుద్యోగుల నిరసనలు
- పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు, రైళ్లు రద్దు
- భయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు
- చావో రేవో ఇక్కడే-రైలు పట్టాలపై యువకుల బైటాయింపు
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో/సిటీబ్యూరో
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగాన్ని తలపించింది. రాళ్లు రువ్వడం, రైలింజన్లు, బోగీలకు నిప్పు పెట్టడం, సీసీ కెమేరాల ధ్వంసం, రైల్వే ట్రాక్‌లపైకి ద్విచక్ర వాహనాల్ని విసిరేసి తగులబెట్టడం, పోలీసుల లాఠీచార్జీ, టియర్‌గ్యాస్ ప్రయోగం, కాల్పులు, మరణాలు, క్షతగాత్రులు... ఇలా ఎన్ని రకాల విధ్వంసాలు జరగాలో అన్నీ అక్కడ జరిగాయి. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' స్కీంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన ఈ ఆందోళనలు అకస్మాత్తుగా దక్షిణాదికీ పాకాయి. దానిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఉద్యోగార్ధులు ముట్టడించారు. వీరంతా 2021 మార్చిలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జరిగిన సైనిక్ ర్యాలీ (రిక్రూట్మెంట్)లో దేహదారుఢ్య పరీక్షలు, మెడికల్ టెస్ట్‌లు పాసయినవారే. వీరందరికీ రక్షణ శాఖ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సిఈఈ) నిర్వహించాల్సి ఉంది. కోవిడ్ పేరు చెప్పి దాదాపు 11 సార్లు ఈ పరీక్షల్ని రక్షణశాఖ వాయిదా వేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీం పేరుతో నాలుగేండ్ల కాలపరిమితితో కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో 2021 మార్చిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పెట్టాల్సిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సిఈఈ)ను రద్దు చేస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. దాదాపు ఏడాదిన్నర నుంచి సీఈఈ కోసం ఎదురు చూస్తూ, ఇక సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల్లో చేరతాం అనుకుంటున్న టైంలో అగ్నిపథ్ ప్రకటన వెలువడింది. సీఈఈ రద్దుతో వీరందరికీ ఇప్పుడు వయోపరిమితి మించిపోయింది. మరోసారి రిక్రూట్ అయ్యే అవకాశాన్ని వీరంతా కోల్పోయారు. ఫలితంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని పథకం ప్రకారం ఒకేసారి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై మెరుపుదాడి చేశారు. అగ్నిపథ్ స్కీంను రద్దు చేయాలనీ, తమకు సీఈఈ నిర్వహించాలంటూ నినాదాలు చేస్తూ విధ్వంసానికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో మరింత ఆగ్రహావేశాలకు లోనై రైళ్లకు నిప్పుపెట్టారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో తొలుత రెతీఫైల్ బస్టాండ్ వద్ద ఓ బస్సు అద్దాలు పగులకొట్టి నిరసనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈలోపు చిలకలగూడ వైపు ఎంట్రన్స్ నుంచి ఒక్కసారిగా యువకులు 5 నుంచి 1వ నెంబర్ ప్లాట్‌ఫారాల మీదకు పెద్దగా అరుస్తూ, చేతికి అందిన వస్తువుల్ని విసిరేస్తూ వచ్చారు. కొందరు యువకులు పెట్రోల్ బాటిళ్లు కూడా వెంట తెచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని ఆగి ఉన్న రైలు బోగీల్లో చల్లి నిప్పుపెట్టారు. అయితే వారెవరూ ప్రయాణీకుల్ని లక్ష్యంగా చేసుకోలేదు. మూడు రైళ్లలోనూ రైల్వే పార్సిల్ బోగీలు, పోస్టల్ బోగీలు, రైలు క్యాంటీన్ బోగీలు, ఖాళీగా ఉన్న ఏసీ బోగాలనే లక్ష్యంగా చేసుకొని నిప్పంటించారు. ఈ విధ్వంసంతో రైలు ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో స్టేషన్ బయటకు పరుగులు తీసారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్ (21)కు ఛాతీలో బుల్లెట్ దిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సోదరి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో పనిచేస్తుంది. మూడేండ్లుగా అతను ఆర్మీలో చేరేందుకు కోచింగ్ తీసుకుంటున్నాడు. కాల్పుల్ని నిరసిస్తూ ఆందోళనకారులు చిలకలగూడ రైల్వే గోదాంకు నిప్పుపెట్టారు. దానితో అక్కడి కాపర్ వైర్ బండిళ్లు తగులబడ్డాయి. అజంతా, ఈస్ట్‌కోస్ట్, ఫలక్‌నుమాతో పాటు రిలీఫ్ ట్రైన్ల పలు బోగీలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులు ఇండియన్ లవర్స్ ఆర్మీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌మాతాకీ జై, ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు రెతీఫౖౖెల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆరు బస్సుల అద్దాలు పగులగొట్టారు.
రైల్వేస్టేషన్ ముట్టడికి ముందే ప్లాన్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముట్టడికి నిరుద్యోగ యువకులు ముందుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్ ద్వారానే వీరంతా ఒకచోటకు చేరినట్టు తెలుస్తున్నది. రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 15న మధ్యాహ్నం 1:50 గంటలకు గ్రూప్ క్రియేట్ అయ్యింది. అలాగే వరంగల్ జిల్లాలో ఓన్లీ పేరుతో మరో గ్రూప్‌తో పాటు, 15న ఉదయం 11:12 గంటలకు మరో గ్రూప్‌ను క్రియేట్ చేశారని పోలీసులు గుర్తించారు. గ్రూప్‌లో మొత్తం 2వేల మంది జాయిన్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9:30 గంటలకల్లా బస్సులు, టాక్సీలు, రైళ్లు, కార్లలో విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మరికొందరు రెండు రోజుల ముందే హైదరాబాద్‌కు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
భారీ బందోబస్తు
సికింద్రాబాద్ ఘటనతో అప్రమత్తమమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. టాస్క్ఫోర్సు, రైల్వే, సీఆర్పీఎఫ్, ఇంటలిజెన్స్, సివిల్ పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. రైల్వేస్టేషన్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిరసన కారులకు నచ్చజెప్పేందుకు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ రంగనాథ్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతోపాటు ఏసీపీలు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. రైల్వే డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య ఘటనా స్థలికి చేరుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అభ్యర్థులు తేల్చి చెప్పారు. మరోవైపు ధ్వంసమైన రైళ్లను రైల్వే సిబ్బంది ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన ఫ్లాట్‌ఫామ్‌ల్లో మరమ్మత్తులు చేపట్టారు.
రైళ్ళు రద్దు.. దారి మళ్లింపు
ఆ ఘటనతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్ళించింది. కొన్ని రైళ్లను మౌలాలీ, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి నడపాలని నిర్ణయించింది. 66 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. మెట్రోరైల్ సేవల్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.కాజీపేట, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
దశలవారీగా అరెస్టులు
రైల్వే స్టేషన్‌పై దాడి ఘటనలో పలువురు ఆందోళనకారుల్ని రైల్వే, సివిల్ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 9 గంటల వరకు దశలవారీగా వారిని అరెస్టు చేస్తూనే ఉన్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపించిన పలువురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే పోలీసులు పలు సెక్షన్ల క్రింద ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. వాటిని సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలను పరిరక్షించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దుకాణాలు బంద్
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. రెతిఫైల్తో పాటు ఇతర బస్టాండ్లలోని బస్సు సర్వీసుల్ని ఇతర ప్రాంతాలకు మళ్ళించారు.