Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకం వద్దేవద్దు
- యువకులకు ఇది అగ్నిపరీక్ష
- ఆ పథకాన్ని కేంద్రం రద్దు చేయాలి
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్
- హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేండ్లపాటు సైనికుల నియామకం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శి ంచారు. ఈ కొత్త దాన్ని రద్దు చేయాలని మోడీ సర్కార్‌ను ఆయన డిమాండ్ చేశారు. పాతపద్ధతిలోనే సైనికుల నియామకాలను చేపట్టాలని కోరారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యం లో అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్ర మాన్ని నిర్వహించారు. సుందరయ్య పార్క్ చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. 'అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి, కాం ట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకం సిగ్గుచేటు, నిరసన తెలిపే సైనిక అభ్యర్థులపై పోలీసుల కాల్పులను ఖండిం చండి, శాశ్వత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి' అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేండ్లపాటు సైనికుల నియామకాల కోసం కేంద్రం కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు 17 ఏండ్ల కాలానికి సైనికుల నియామకాలు జరిగేవని గుర్తు చేశారు. అగ్నిపథ్ పథకం దేశంలోని యువకులకు అగ్నిపరీక్షలాగా మారిందన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూసిన యువలకులకు ఈ పథకం వల్ల ఆశాభంగం కలిగించిందని అన్నారు. దేశ సేవ కోసం, భద్రత కోసం ప్రాణమైనా ఇచ్చేందుకు, త్యాగం చేసేందుకు సిద్ధపడిన వారి జీవితాలకే భద్రత లేకుండా కేంద్ర ప్రభుత్వం హరిస్తున్నదని విమర్శించారు. నాలుగేండ్ల తర్వాత తొలగిస్తే దేశ భద్రత పటిష్టంగా ఉంటుందన్న బీజేపీ నాయకులు మాటలు సిగ్గులేనివని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్, కార్గిల్ వంటి యుద్ధాలు చేశామంటూ బీజేపీ నాయకులు గొప్పగా చెప్తున్నారని అన్నారు. 17 ఏండ్లపాటు ఉన్న సైనికులే ఆ యుద్ధాలు చేసి దేశ భద్రతను కాపాడారని గుర్తు చేశారు. వారు లోపాలు చేసినట్టు మాట్లాడ్డం సరైంది కాదన్నారు. నాలుగేండ్ల వరకే నియామకాలు చేపడితే గొప్పగా పోరాడాతారంటూ కేంద్రం వైఖరి ఉండడం దుర్మార్గమని విమర్శించారు. ఎంత తాత్కాలికంగా, ఎంత అభద్రతలో ఉంటే అంతబాగా దేశ రక్షణ కోసం కృషి చేస్తారంటూ వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ భద్రతతో బీజేపీ ఆటలాడుకుంటున్నదని విమర్శించారు. కేంద్రం నిర్ణయంపై యువకులు ఆగ్రహా వేశాలతో ఆందోళన చేస్తున్నారని చెప్పారు. వారు దుర్మా ర్గులు, దేశద్రోహులు, ఉగ్రవాదులైనట్టు, ఆస్తులు ధ్వంసం చేసినట్టు కేంద్రం దురుసుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశం కోసం ప్రాణలిచ్చేందుకు సిద్ధపడ్డ వారిని దేశభక్తులుగా చూడాలని కోరారు. మోడీ సర్కారు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలని సూచించారు. రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మాట్లాడ్డం సరైంది కాదని చెప్పారు. అది అప్పటికపడు వచ్చిన ఆందోళన అని అన్నారు. రైతుల ఆందోళన విషయంలోనూ తొలుత దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత చట్టాలను ఉపసంహరించుకున్నారనీ, ఇప్పుడు అగ్నిపథ్‌నూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేధావులు, నిపుణులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులతో సంప్రదించి కేంద్రం వాస్తవాలు గ్రహించాలని సూచించారు. అందరి అంగీకారంతో నిర్ణయా లు చేస్తేనే దేశానికి రక్షణ ఉంటుందన్నారు. ఏక పక్షంగా కేంద్రం ముందుకెళ్తే దేశ భద్రతకే ముప్పు వాటి ల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు తాము దేశభక్తులం అంటూ గొప్పపలకు పోతారనీ, ఇప్పుడేమో దేశానికే హాని చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాలుగేండ్లపాటు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేపడితే జీతాలు, పింఛన్, గ్రాట్యూటీ మిగులుతుందంటూ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తున్నదని చెప్పారు. అంబానీ, అదానీ సహా కార్పొరేట్ శక్తులకు రక్షణ రంగాన్ని కట్టబెట్టేం దుకు కేంద్రం లక్షల కోట్ల పన్ను రాయితీలను ప్రకటిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టిన వారికీ రాయితీలు ప్రకటిస్తున్నదని అన్నారు. కానీ సైనికుల సంక్షేమానికి నిధులు వెచ్చించేందుకు, వారికి జీతాలిచ్చేందుకు కేంద్రానికి మనసు రావడం లేదని విమర్శించారు. సైనిక సంక్షేమానికి కోత పెట్టి కార్పొరేట్ శక్తులకు రాయితీలివ్వడం సరైంది కాదన్నారు. ఇది దేశద్రోహం తప్ప మరొకటి కాదని చెప్పారు. బీజేపీ సర్కారు దీనిపై పునరాలోచించాలని కోరారు.
అభ్యర్థులను అణచివేయడం సరికాదు
సికింద్రాబాద్‌లో ఆందోళనాకారులపై పోలీసులు కాల్పు లు జరిపారనీ, ఒకరు చనిపోయారనీ, చాలా మంది గాయ పడ్డారని రాఘవులు చెప్పారు. ఈ ఆగ్రహావేశాలను అర్థం చేసుకోకుండా పై అధికారుల ఆదేశాల ప్రకారమే కాల్పులు జరిపామంటూ పోలీసులు ప్రకటించడం సరైంది కాదన్నా రు. శత్రువుల ప్రాణాలు తీసేందుకు, దేశం కోసం ప్రాణాలి చ్చేందుకు సిద్ధమైన వారిని అణచివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని అన్నారు. వారిపై కేసులు నమోదు చేయొద్దని కోరారు. చనిపోయిన వారి కుటుంబానికి నష్టపరిహారం, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఒకవేళ కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి రక్షణ కల్పించాలనీ, వైద్యం అందించాలని కోరారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం వల్ల దేశంలోని యువకులు ఇబ్బందులు పడి ఆవేశానికి లోనవుతున్నారని చెప్పారు. కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకాలు చేప ట్టడం దుర్మార్గమని విమర్శించారు. బడ్జెట్‌ను సైనికుల సంక్షే మానికి తగ్గించి ఆ యుధాల కొనుగోలుకు ఆ నిధులను విని యోగించే కుట్ర కేంద్రం చేస్తున్నదని అన్నారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, డిజి నరసింహా రావు, టి జ్యోతి, ఎండీ అబ్బాస్‌తోపాటు పార్టీ, ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.