Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్నిపథ్ నిరసనలో యువకుడి మృతి
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో...
- అక్క దారిలో వెళ్లాలనుకొని..
- దబ్బీర్‌పేటలో విషాదం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి, ఖానాపూర్
బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న తన అక్క రాణి స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్న దామేర రాకేశ్.. 'అగ్నిపథ్' నిరసనలో పోలీసుల తూటాకు బలి అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పద్దతిని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యువత నిరసనకు దిగగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం దబ్బీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్ (20) మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దిచర్లకు చెందిన మరో యువకుడు వినరుకి బుల్లెట్ దిగడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వినరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాంతో దభీర్పేట, మద్దిచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. దబ్బీర్‌పేటకు చెందిన దామెర కుమారస్వామి, పూలమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్నకుమారుడైన రాకేశ్ ఆర్మీ ర్యాలీలో స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో పాల్గొని ఎంపికయ్యారు. రాకేశ్‌కు ఫిజికల్, మెడికల్ పరీక్షలు పూర్తయ్యాయి. రాత పరీక్ష కోసం కొన్ని నెలలుగా హన్మకొండలోనే ఉండి సన్నద్ధమవుతున్నారు. రాకేశ్ చిన్న అక్క రాణి వెస్ట్‌బెంగాల్‌లో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. రాణి స్ఫూర్తితో రాకేశ్ ఆర్మీలో చేరాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్' పథకం ప్రకటించ డంతో ఆర్మీ ఉద్యోగాలకు సన్నద్దమవు తున్న యువకులంతా నిరసనలో పాల్గొనడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి రైల్వే పోలీసులు లాఠీఛార్జి చేయడంతో యువకులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్ మృతిచెందాడు. ఖానాపూర్ పోలీసులు దబ్బీర్పేటలోని రాకేశ్ తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించడంతో వారంతా సికింద్రాబాద్‌కు తరలిపోయారు.
వినయ్ పరిస్థితి విషమం..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దిచర్ల గ్రామానికి చెందిన లక్కం వినయ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. వినయ్‌ని వైద్య చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు కాల్పులు జరిపారని, నాకేమైనా అయితే పోలీసులదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించాడు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి 'ఎర్రబెల్లి' ఆగ్రహం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన దురదృష్టకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నిరుద్యోగుల పట్ల కేంద్ర వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బీర్‌పేట యువకుడు మృతిచెందడం విచారకరమన్నారు. వినరుతో పాటు పలువురు గాయపడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం అర్ధం లేనిదన్నారు. ఇలాంటి నిర్ణయాలతో యువత ఉసురుపోసుకుంటున్నారన్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం 5.6 శాతం నుంచి 7.83 శాతానికి పెరిగిందన్నారు. వాళ్ల చేతకానితనాన్ని ఇతర రాజకీయ పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, అల్లర్ల వెనుక రాజకీయ పార్టీలున్నాయనడం అసంబద్దమన్నారు. నిరుద్యోగులు సంయమనం పాటించాలన్నారు.
రాకేశ్‌ది కేంద్ర ప్రభుత్వ హత్య : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న ఆర్మీ విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరగ్గా దామెర రాకేశ్ మృతిచెందాడని, రాకేశ్‌ది కేంద్ర ప్రభుత్వ హత్య అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే రాకేశ్ కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి సేవ చేసే సైనిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రశ్నించిన వారిని కాల్చి చంపడం హేయమైన చర్య అన్నారు. ఒక పేద యువకుడిని బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించడానికి మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వాళ్లకు దేశ ప్రజలే బుద్దిచెబుతారన్నారు.