Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందస్తు చర్యలో భాగంగా మెట్రో గేట్ల మూసివేత
- రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన మెట్రో సిబ్బంది
- సాయంత్రం 6.35 గంటల తర్వాత పునరుద్ధరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం హైదరాబాద్ మెట్రో సేవలపై పడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సైనిక అభ్యర్థుల ఆందోళనలతో మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందస్తు చర్యలో భాగంగా హైదరాబాద్ నగరంలోని మెట్రోకు సంబంధించిన మూడు కారిడార్లలో సర్వీసులను నిలిపేస్తున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. దీంతో అన్ని మెట్రో స్టేషన్ల గేట్లను సిబ్బంది మూసేశారు. దాదాపు 57 ట్రైన్లు డిపోలకే పరిమితం కాగా.. 700కుపైగా సర్వీసులు రద్దు అయ్యాయి. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే మెట్రో రైళ్లు నడిచాయి.ఇక అప్పటికే మెట్రో కోసం వచ్చిన ప్రయాణికులు గేట్లు వెనక్కి వెళ్లారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. అంతేగాక అప్పటికే మూడు కారిడార్లలో మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని సైతం ఎక్కడికక్కడే దింపేయడంతో వందలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికంగా డబ్బులు చెల్లించి ఆటోలు, క్యాబ్‌లు బుక్ చేసుకుని వెళ్లిపోయారు. ఆర్టీసీ, ఆటోల్లో జనం కిక్కిరిసి కనిపించారు. సాయంత్రం 6.35 గంటల తర్వాత తిరిగి మెట్రో సేవలను పునరుద్ధరించినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.