Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కోడ్లు అమలైతే వేతన ఒప్పందం అసాధ్యం
- కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే విదేశీ బొగ్గు కొనుగోలు
- కేంద్ర విధానాలపై పోరాడితేనే కార్మికవర్గానికి భవిష్యత్ :
- సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షుడు ఎం.సాయిబాబు
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి/ గోదావరిఖని
భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనుకాడటం లేదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు అన్నారు. శుక్రవారం గోదావరిఖనిలో జరిగిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కూడా బడా కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టి పర్మినెంట్ ఉద్యోగులను వీధినపడేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి, గౌరవప్రదమైన జీవితాన్ని కార్మిక వర్గం కొనసాగించడానికి ప్రభుత్వరంగ సంస్థలు దోహద పడుతున్నాయన్నారు. లాభాల బాటలో నడుస్తున్న దేశంలోని బొగ్గు సంస్థలను నిర్వీర్యం చేయడానికి విదేశీ బొగ్గు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. దేశంలో బొగ్గు సంస్థలు టన్ను బొగ్గును రూ.నాలుగు వేలకు అమ్ముతుండగా, విదేశాల నుంచి టన్ను బొగ్గు రూ.24 వేలకు కొనుగోలు చేయాలని షరతులు విధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆదాని గ్రూప్ బొగ్గు సంస్థలకు లాభం చేకూర్చడానికి ఈ దుస్సాహసానికి పాల్పడినట్టు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇప్పటికే దేశంలోని బొగ్గు సంస్థలు కార్మికుల నియామకాలు గణనీయంగా తగ్గించాయని, రాబోయే కసింగరేణికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చిందని, ఈ కోడ్ల అమలు జరిగితే బొగ్గు గని కార్మికులకు వేతన ఒప్పందం జరగడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు ప్రాణ త్యాగంతో సాధించుకున్న అనేక హక్కులు కోల్పోతారన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి చైతన్యవంతమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల కోసం బలంగా పోరాటం జరిపినప్పుడు.. కార్మికులు ఎర్రజెండా కింద సమీకృతం అవుతారని తెలిపారు. సింగరేణిని రక్షించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర విధానాల మీద పోరాడాల్సిందినేని పిలుపునిచ్చారు. సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అధ్యక్షత వహించగా.. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రాజారావు ప్రారంభించి మాట్లాడారు. కాంట్రాక్ట్ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడి బొగ్గు పరిశ్రమను రక్షించుకో వాలన్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో కాల్పుల్లో మరణించిన యువకుని మృతికి సంతాపం ప్రకటించారు. అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని సింగరేణి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.మధు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి ముత్యం రావు, నాయకులు నాగరాజు గోపాల్, అన్ని బ్రాంచీల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.