Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూముల్లో జెండాలు
- వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్
నవతెలంగాణ-హసన్పర్తి
రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతుతున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్ తెలిపారు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చెర్ల చెరువు శిఖం భూమి, పెంబర్తి వెంకటాద్రికుంటలోని ప్రభుత్వ భూముల్లో శుక్రవారం ఎర్ర జెండాలు పాతి గుడిసెలు వేయించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. గుడిసెలు లేని నగరంగా మారుస్తామని, కుర్చీ వేసుకొని మరీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని, తదితర హామీలతో ఊదరగొట్టిన సీఎం కేసీఆర్ తదనంతరం ముఖం చాటేశాడని విమర్శించారు. అధికార పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, చెరువు శిఖం, తదితర భూములు అధికార పార్టీ నేతల అండతోనే కబ్జాకు గురతున్నాయని విమర్శించారు. ముచ్చెర్ల చెరువు శిఖం భూమి, పెంబర్తి వెంకటాద్రి కుంటలో ప్రభుత్వ భూముల్లో స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాదారులని చెప్పారు. ఇప్పటికే సగం చెరువును కబ్జా చేసి మొరంతో లెవలింగ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కబ్జాల్లో ఉన్న ప్రభుత్వ భూములను బయటకు తీసి పేదల నివాస స్థలాలకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు, నాయకులు సతీష్, భాగ్య, కమల, రమ, తదితరులు పాల్గొన్నారు.