Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పటికే ఒకరు మృతి
- 13 మందికి కొనసాగుతున్న చికిత్స
- వివరాలు వెల్లడించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
నవతెలంగాణ- సికింద్రాబాద్/సిటీబ్యూరో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో.. పోలీసుల కాల్పుల్లో గాయపడిన 14 మందిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వరంగల్ వాసి రాకేశ్ మృతిచెందాడు. ఆస్పత్రికి వచ్చేసరికే అతని పల్స్రేట్ పడిపోయిందని, 45 నిమిషాలపాటు సీపీఆర్ చేసినా ఉపయోగం లేకుండా పోయిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. మృతదేహానికి మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తి చేసి, సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. మిగతా 13 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. చికిత్స పొందుతున్న వారిలో కర్నూలు జిల్లాకు చెందిన జగన్నాథ రంగస్వామి, కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన కె.రాకేశ్, మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ గ్రామానికి చెందిన జై శ్రీకాంత్, వరంగల్ జిల్లాకు చెందిన ఏ.కుమార్, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌కు చెందిన జి.పరుశరాం, పి.మోహన్, ఖమ్మం జిల్లాకు చెందిన నాగేంద్రబాబు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లకం వినరు, ఆసిఫాబాద్‌కు చెందిన ఈ విద్యాసాగర్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎస్.లక్ష్మణ్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన డి.మహేశ్, భరత్ కుమార్ ఉన్నారు. మరోవైపు పోలీసులు ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.