Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్మీ అభ్యర్థులపై కాల్పులకు కేంద్రానిదే బాధ్యత
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్
- కేంద్రం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
త్రివిధ దళాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ నో పెన్షన్.. నో ర్యాంక్ పథకంలా ఉందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆ సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కోట రమేశ్‌ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు తాళ్ల నాగరాజు, ఆనగంటి వెంకటేశ్ మాట్లాడారు. దేశ భద్రతను కాపాడే సైనికులను అభద్రతా భావంలోకి నెట్టేవిధంగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను తెచ్చిందన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం యువత రెండేండ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తోందని చెప్పారు. ఉద్యోగ భద్రత లేకుండా 4.5 లక్షల నుంచి 11లక్షల వరకు జీతంతో నాలుగేండ్లు మాత్రమే ఆర్మీలో పనిచేసేలా కాంట్రాక్టు పద్ధతి పథకాన్ని తీసుకురావడంతో యువత భవిష్యత్, దేశ భద్రత ప్రమాదంలో పడుతుందన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నో పెన్షన్ నో ర్యాంక్ చేసేవిధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా యువత నిరసన తెలుపుతోందని,సికింద్రాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు కాల్పులు జరపడం దారుణమన్నారు. తెలంగాణ నుంచి ఏటా 35వేల మంది ఆర్మీ రిక్రూట్మెంట్స్లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు. దేశ భద్రత పరిరక్షించే సైన్యంలో అగ్నిపథ్ వంటి చర్యలు దేశద్రోహ చర్యలు అన్నారు. ఈ ఘటనలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించాలన్నారు. సికింద్రాబాద్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని, చనిపోయిన యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రవి, జావిద్, అశోక్ రెడ్డి, లెనిన్, మహేశ్, రాజు, క్రిష్ణ నాయక్, నరేష్, కిరణ్, శ్రీకాంత్, ప్రశాంత్, సూరి, నాగరాజు, జగన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.