Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నిరసన
- ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
- నిరుద్యోగులపై కాల్పులకు ఖండన
- కాజీపేట రైల్వేస్టేషన్లో భారీ బందోబస్తు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో నిరసన తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోనూ నిరసన తెలిపి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు.
అగ్నిపథ్‌ను రద్దు చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలో పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక హమాల్‌వాడీ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతపై లాఠీచార్జీ చేయడాన్ని ఖండించారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో నయాబజార్ కాలేజ్ ఎదుట, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని, విద్యార్థులపై కాల్పులను ఖండిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో నల్ల జెండాలు పట్టుకుని ప్రదర్శన తీసి.. దిష్టిబొమ్మ దహనం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూ డలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సైనిక్‌పురి కాలనీలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు.
అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, దిష్టిబొమ్మ దహనం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.
కాజీపేటలో
భారీ బందోబస్తు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే జంక్షన్లో జరిగిన రగడతో కాజీపేట రైల్వేస్టేషన్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ యువకుడు మృతిచెందిన నేపథ్యంలో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలను, ప్రయాణికులను రైల్వేస్టేషన్‌లోకి అనుమతించకుండా భద్రత చర్యలు చేపట్టారు. రైల్వే జంక్షన్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. కాజీపేట మీదుగా నడిచే దానాపూర్, హౌరా, షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ఉద్రిక్త వాతావరణంలో కాజీపేట మీదుగా కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకోగా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు బయల్దేరింది. సికింద్రాబాద్ నుంచి రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే సిబ్బంది కాజీపేట రైల్వే జంక్షన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి రైల్వే స్టేషన్ల రైల్వేస్టేషన్లలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.