Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్‌పై సమీక్షించుకోవాలి
- నిరుద్యోగ యువతలోని ఆగ్రహానికి ఆందోళనలు నిదర్శనం : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిరుద్యోగ యువతలో గూడుకట్టుకున్న ఆగ్రహానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు నిదర్శనమనీ, ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరిచి అగ్నిపథ్ పథకంపై సమీక్షించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రక్షణ రంగం నిపుణులు, మేధావులు, ప్రతిపక్షాలు, యువతతో ఎలాంటి చర్చలు జరుపకుండా ఏకపక్షంగా, నియంతృత్వ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలాంటి దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ -నో పెన్షన్ స్థాయికి బీజేపీ దిగజార్చిందని విమర్శించారు. దేశభద్రతను సైతం కాంట్రాక్ట్ విధానానికి అప్పజెప్పాలని చూడటం మోడీ సర్కారు డొల్లతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం నాలుగేండ్ల పాటు ఆర్మీలో విధులు నిర్వర్తించిన తర్వాత 75 శాతం మంది నిరుద్యోగులుగా మారుతారని వివరించారు. ఆ తర్వాత వారికి ప్రయివేటు రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పటం శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం చర్యలున్నాయని విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనలో ఆర్మీ అభ్యర్థి రాకేశ్ మరణించడం బాధాకరమనీ, బాధిత కుటుంబానికి తన సానుభూతి ప్రకటించారు. ఆ యువకుని చావుకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, లాక్డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సీఏఏ వంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. దేశంలో ఏ సంక్షోభం వచ్చినా మౌనాన్ని ఆశ్రయించే ప్రధాని నరేంద్రమోడీ అగ్నిపథ్‌పై నోరువిప్పాలని డిమాండ్ చేశారు.
కేవలం రూ.30 వేల జీతమా? : నిరంజన్‌రెడ్డి
దేశభద్రతలో కీలకపాత్ర వహించే 46 వేల మందిని 90 రోజుల్లో నియమించి కేవలం రూ.30 వేల జీతం ఇవ్వడం, వారిని నాలుగేండ్ల తర్వాత బయటకు పంపడం వంటి కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్లనే నేడు దేశంలో ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పదోతరగతి పాసై అగ్నిపథ్‌లో చేరితే నాలుగేండ్ల తర్వాత ఇంటర్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం దారుణమనీ, వారిని దేశ రక్షణ కోసం తీసుకుం టున్నారా? 12వ తరగతి పాసైనట్టు సర్టిఫికెట్ ఇచ్చేందుకు తీసుకుం టున్నారా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఘటనలో గాయపడ్డ అభ్యర్థులకు, రాకేశ్ కుటుంబానికి కేంద్రం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మోడీ అనాలోచిత నిర్ణయాల వల్లనే అన్నదాతలు, యువత రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి నెలకొందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాకేశ్ కుటుం బానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. క్షతగా త్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశిం చారు. దేశ ప్రజలను ఏదో ఒక రీతిలో రెచ్చగొట్టడం దాన్ని చూస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం బీజేపీకి ఒక తంతుగా మారిందని విమర్శి ంచారు. సికింద్రాబాద్ ఘటన దురదృష్ణకమరమని పీయూసీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.