Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 ఏండ్లలో కాని అభివృద్ధిని ఆరేండ్లలో చేశాం : ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నాలుగు జిల్లా జిల్లాలకు సాగు, తాగునీరందించే పాలమూరు-రంగారెడ్డితో పాటు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయి పాలమూరు మరో కోనసీమగా మారే సమయం దగ్గర్లోనే ఉందని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు కొల్లాపూర్, బిజినేపల్లి మండల
కేంద్రాల్లో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొల్లాపూర్‌లో బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. 60 ఏండ్లలో కాని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలో చేసి చూపిందన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన కొత్త పెన్షన్లను జూన్, జులై మాసాల్లో ఊరూరూ తిరుగుతూ అర్హులైన వారికి అక్కడికక్కడే అందజేయనున్నట్టు చెప్పారు. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా సమయంలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచన మేరకు సింగోటం నుంచి గోపాల్ దిన్నె లింక్ కెనాల్ ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు. హైలెవల్ బ్రిడ్జి కావాలని, చిన్న లిఫ్టులు రూ.12 కోట్లతో ఖర్చు చేస్తే ఐదారు వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామని హామీచ్చినట్టు చెప్పారు.
సోమశిల- సిద్దేశ్వరం వంతెన కోసం ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి పట్టు వదలకుండా సాధించుకున్నారన్నారు. వంతెన పూర్తైతే ఏపీతో మరింత సంబంధాలతో పాటు వ్యాపార పరంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. కొల్లాపూర్ మామిడి రైతులను దృష్టిలో ఉంచుకుని మామిడి మార్కెట్ యార్డును మంజూరు చేశామని చెప్పారు. సోమశిలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీనిచ్చారు. అమరగిరి ప్రాంతంలో కూడా పర్యాటక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శ్రీశైలం నిర్వాసితులకు 98 జీఓ ప్రకారం లస్కర్ పోస్టులివ్వాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అందరికి న్యాయం చేస్తామన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో ఏం అభివృద్ధి చేసిందని, నాడు చేయని అభివృద్ధి నేడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలో కుల, మత పిచ్చి పార్టీలను కాకుండా ప్రజల సంక్షేమం కోసం పాటు పడే పార్టీలను ఎన్నుకోవాలన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశాన్ని వల్లకాడుగా మారుస్తుందన్నారు. సభలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు భీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.