Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సనత్నగర్లో పరీక్షల కోసం టోకెన్లు.....
- అవీ పరిమితంగానే పంపిణీ
- ఫాస్టింగ్ టెస్టులకు ఉదయం 10 దాటే వరకు ఆగాల్సిందే
- మందుల కోసం డిస్పెన్సరీ, సూపర్ స్పెషాలిటీ మధ్య పరుగులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అది హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. రాష్ట్రంలోని పలు డిస్పెన్సరీల నుంచి రోగులు స్థానిక డాక్టర్ల సిఫారసులపై అక్కడకు వస్తుంటారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆ ఆస్పత్రిలో పలువురు ప్రముఖ వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. నిత్యం వేలాది మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్నారు. ఇందులోనూ ఓపీ విభాగంలో చూయించుకునేందుకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉంటున్నది. అయితే వచ్చే రోగుల్లో చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారూ ఉంటున్నారు. వీరికి తోడు వికలాంగులు కూడా వస్తుంటారు. అయితే ఓపీ విభాగంలో చూపించుకునేందుకు ఓపీడీ స్లిప్ రాయించుకున్న రోగులు తాము సంప్రదించాలనుకున్న డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు రిజిస్టర్లో నమోదు చేసుకుంటారు. ఇక అక్కడ్నుంచి వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి.
కూర్చునేందుకు వీల్లేదు...
ఉదయాన్నే రోగులు వచ్చినప్పటికీ డాక్టర్లు వచ్చేంత వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వేచి చూసే రోగుల కోసం సాధారణంగా కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల్లో కూర్చునే సౌకర్యం ఉంటుంది. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో మాత్రం అలాంటి సౌకర్యాన్ని కల్పించకపోవడంతో రోగులు గంటల తరబడి లైన్లలో నిలుచోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వద్ధులు, పిల్లలు, వికలాంగుల పరిస్థితి దారణంగా ఉంటున్నది. ఇక గర్భిణులు ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పనలవి కావంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూర్చునేందుకు తగిన సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
టెస్టు టోకెన్ కోసం ఉదయం నాలుగు గంటలకే.....
అక్కడ రక్త పరీక్షలు చేయించుకోవాలంటే రన్నింగ్ రేస్ వచ్చి ఉండాలన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రతి రోజూ పరిమిత సంఖ్యలోనే టెస్టులు చేయాలనీ, అందులోనూ ముందుగానే టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే చేయాలని నిర్ణయించారు. దీంతో ఆ టెస్టుల టోకెన్ల కోసం ఉదయం నాలుగు గంటల నుంచి వచ్చి లైన్లో నిలుచుంటున్నారు. అప్పటికీ క్యూ కట్టిన వారందరికీ టోకెన్లు ఇస్తారా? అంటే అదీ లేదు. కొంత మందికి ఇచ్చి మిగిలిన వారిని మరుసటి రోజు రమ్మని పంపిస్తున్నారని రోగులు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ సెక్యూరిటీ సిబ్బందికి, రోగులకు మధ్య వాగ్వాదం జరగడం సాధారణ విషయంగా మారిపోయింది. ఇలా రెండు, మూడు రోజులు తిరిగినా కొంత మంది టోకెన్ దొరకకపోవడంతో అనివార్యంగా ప్రయివేటులో టెస్టులు చేయించుకుంటున్నారు. దీనికి తోడు ఏమి తినకుండానే చేయించుకోవాల్సిన పరీక్షల నమూనాలను కూడా మిగిలిన వారితో కలిపి సేకరిస్తుండటంతో వారి వంతు వచ్చే వరకు ఉపవాసముండాల్సిందే. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉదయం ఆరు గంటల నుంచే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తదితర పరీక్షలకు నమూనాలు సేకరించే సౌకర్యముంటుంది. కాని ఈఎస్ఐలో అలా కాదు. తొమ్మిది, 10 గంటల వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
మందుల్లేవు......
అన్నింటికి ఓర్చుకుని పరీక్షలు చేయించుకుని డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత రాసిన మందుల కోసం వెళితే అక్కడ మళ్లీ క్యూ కట్టాల్సిందే. మందుల షాపులో డాక్టర్లు రాసిన మందులు పూర్తి స్థాయిలో దొరకడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ లేని మందులను డిస్పెన్సరీల్లో తీసుకోవాలంటూ సిబ్బంది సూచిస్తున్నారు. డిస్పెన్సరీల్లోనూ మందుల కొరత తీవ్రంగా ఉంటున్నదని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లాంటి చోట దొరకని మందులు డిస్పెన్సరీల్లో ఎలా దొరుకుతాయో అర్థం కాని పరిస్థితి. దీంతో అత్యవసరంగా వాడాల్సిన మందులను వాయిదా వేయడం ఇష్టం లేక ప్రయివేటులో కొనుక్కుంటున్నట్టు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలు కల్పించాల్సిందే....మందులన్నీ ఇవ్వాల్సిందే...
రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా ఈఎస్ఐ కార్డుదారులున్నారు. ఐపీల కుటుంబాలతో కలుపుకుని వీరి సంఖ్య దాదాపు 80 లక్షల వరకు ఉంది. ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలను తీసుకుంటున్నారంటూ పోటాపోటీగా ప్రకటించుకుంటున్నాయి. తాజాగా ఇద్దరు కేంద్ర మంత్రులు శనివారం సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించారు. ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకున్నారు. కనీస సౌకర్యాల నుంచి, అవసరమైన వారందరికి పరీక్షలు చేయడం, డాక్టర్లు రాసిన మందులన్నీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.