Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాకేశ్ అంత్యక్రియలు పూర్తి
- వరంగల్ నుంచి ఖానాపూర్ వరకు అంతిమయాత్ర
- టీఆర్ఎస్, సీపీఐ(ఎం), పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు హాజరు
- కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
- మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మట్టెవాడ/ నర్సంపేట/ ఖానాపురం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసు కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట గ్రామానికి చెందిన రాకేశ్ అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. రాకేశ్ భౌతికకాయం శుక్రవారం రాత్రి ఎంజీఎం మార్చురీకి వచ్చింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినరు భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి,ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పి చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
మార్చురీ నుంచి భౌతికకాయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భుజాలపై మోసుకుంటూ తీసుకొచ్చి వాహనంలో ఎక్కిం చారు. అక్కడి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర నర్సంపేట వరకు సాగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, సీపీఐ(ఎం) కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు, జనం పెద్దఎత్తున తరలివచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డు లు ప్రదర్శించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంజీఎం నుంచి పోచంమైదాన్కు చేరుకో గానే బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసు కుంది. కార్యాలయం లోపలికి చొచ్చుకుపోయేందుకు ఆందోళనకారు లు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కార్యా లయం వద్ద బ్యానర్లను చించివేశారు. వాటిని ఆందోళన కారులు తగులపెట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ( ప్రధాని మోడీ) దిష్టిబొమ్మ ను దహనం చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అగ్నిపథ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా రాకేశ్‌కు నివాళులర్పించేందుకు రాగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీతక్క గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగానే.. టీఆర్ ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. వారిని అక్కడ నుంచి పంపించేశారు. సీతక్కకు పోలీసులు భద్రత కల్పించి అక్కడ నుంచి బయటకు పంపించారు.
రాకేశ్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
అగ్నిపథ్ వల్ల రాకేష్ మృతిచెందాడని, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రధాని మోడీ రైతులు, జవాన్లను మోసం చేస్తూ దేశ భద్రత ను తాకట్టు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనా లోచిత నిర్ణయం వల్ల ప్రాణం కోల్పోయిన రాకేష్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
అంతిమయాత్ర
రాకేశ్ మృతికి కారణమైన అగ్నిపథ్‌ను నిరసిస్తూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట బంద్ నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రాకేశ్ కుటుంబాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడు తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. దబీర్పేటలో గ్రామ ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు.