Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంట పెట్టుబడుల కోసం అన్నదాతల ఎదురుచూపులు
- రాష్ట్రవ్యాప్తంగా సుమారు 68 లక్షల మంది రైతుల నిరీక్షణ
- రూ.7,500 కోట్లకు పైగా అందాల్సిన తొమ్మిదో విడత సహాయం
- సంవత్సర సంవత్సరానికీ ఆలస్యమవుతున్న పంట పెట్టుబడి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పంట రుణాలను నిర్వీర్యం చేసి రైతుబంధును నెత్తికెత్తుకొని దాన్ని సక్రమంగా ఇవ్వలేక.. సీజన్ సీజన్‌కూ వెనక్కు పోతున్న రైతుబంధు నిధుల విడుదల రోజుల తరబడి ఆలస్యమవుతుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 18వ తేదీ వచ్చినా ఈ వానాకాలం పంట పెట్టుబడి నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల మందికి పైగా రైతులు రూ.7,500 కోట్లకు పైగా పదో విడత పంట పెట్టుబడుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే అప్పూసొప్పూ చేసి కిరాయి అరకలు, యంత్ర పరికరాలతో దుక్కి దున్ని, విత్తనాలతో సిద్ధంగా ఉన్న రైతాంగం వర్షం పడిన ప్రాంతాల్లో నాటేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా ఇచ్చే రూ.2,000 మే 31 నాటికే రైతుల ఖాతాల్లో జమైనా వాటితో నాలుగు విత్తన ప్యాకెట్లు కూడా రాలేదని రైతులంటున్నారు. ఎకరానికి రూ.5,000 రైతుబంధు సహాయం అందితే కొంత మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. పథకం ప్రారంభమైన 2018 మినహా ఏ సీజన్లోనూ సకాలంలో పంట పెట్టుబడి సహాయం ఖాతాల్లో జమ కాలేదని అంటున్నారు.
ఏటేటా జాప్యం...
రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏటేటా.. సీజన్ సీజన్‌కూ ఆలస్యమవుతోంది. ఖరీఫ్‌కు సంబంధించి 2018 మే 5, 2019లో జూన్ 4, 2020లో జూన్ 22, 2021లో జూన్ 15వ తేదీన ఇలా ఏటేటా వానాకాలం పంట పెట్టుబడి జమయ్యే సమయం మించుతోంది. 2022 జూన్ 18వ తేదీ వచ్చినా ఈ ఏడాది ఇంత వరకూ వానకాలం పంట పెట్టుబడి సహాయం ఊసులేదు. దీనికి రాష్ట్రప్రభుత్వ ఆర్థిక అనిశ్చితే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 10 మే 2018న ఈ పథకానికి కరీంనగర్ జిల్లా ధర్మరాజ్పల్లి గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున సహాయం అందించింది. 2019 నుంచి దానిని రూ.5వేలకు పెంచింది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌కు ఈ నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 8 విడతలుగా రైతుల ఖాతాల్లో 50వేల కోట్లకు పైగా పంట పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం నేరుగా జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాలకు గాను 68 లక్షల మంది వరకూ రైతులు తొమ్మిదో విడత పెట్టుబడి సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. 2018లో పంట పెట్టుబడి సహాయం ప్రారంభమయ్యాక ఆ ఏడాది రబీ పెట్టుబడి సహాయం రెండో విడత రైతుబంధును సెప్టెంబర్‌లోనే రూ.5,925 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాతి నుంచి రబీ పెట్టుబడి సహాయం కూడా డిసెంబర్‌లోగానీ అందడం లేదు. గత యాసంగి 8వ విడత రైతుబంధును డిసెంబర్ 28, 2021న విడుదల చేశారు. రూ.7,645 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది. 66 లక్షల మంది రైతులకు 52 లక్షల ఎకరాలకు దీనిని వర్తింపజేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు పైగా సేద్యం అవుతుంది. రంగారెడ్డి జిల్లాలో 1.80లక్షల మంది పైగా రైతులు ఈ వానాకాలంలో 4.80 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ ఏడాది 6,35,602 ఎకరాల్లో సాగుచేస్తారని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 5.74లక్షల ఎకరాల్లో సాగుచేయనున్నారు. 1.48 లక్షల మంది రైతులకు 270కోట్లు జమచేయాల్సి ఉంది.
నిధుల సర్దుబాటుతో ఇబ్బందులు
ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయలేక సతమతమవుతున్న కారణంగానే రైతుబంధు ఆలస్యమవుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ- కుబేర్ సాఫ్ట్‌వేర్‌తో బదిలీ చేస్తున్న నిధుల సర్దుబాటు కారణంగా జాప్యం జరుగుతోంది. దాంతో నిధుల పంపిణీకి పది నుంచి 15 రోజుల సమయం తీసుకుంటోంది. తొలుత ఎకరం నుంచి మొదలు పెట్టి క్రమణా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నిధులు విడుదలైనా జూలై అర్థభాగం వరకు నిధుల పంపిణీ కొనసాగే అవకాశం ఉంది.
తప్పని ప్రయివేటు పెట్టుబడులు
ఖరీఫ్ సీజన్‌కు సాధారణంగా పంటపెట్టుబడులు మే 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దుక్కులు దున్నడం, విత్తనాల కొనుగోలు పనుల్లో రైతులు నిమగమవుతారు. మే చివరి వారం, తప్పితే జూన్ మొదటి వారం నాటికి పెట్టుబడి సహాయం చేతిలో ఉండాలి. రుణమాఫీ పూర్తికాని కారణంగా బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు ప్రయివేటుగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. రైతుబంధుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు మొదలు పెట్టలేదు. గత యాసంగి నాటి గణాంకాలు మాత్రమే ఉన్నాయి. నూతనంగా భూములు కొనుగోలు చేసి పాస్‌బుక్‌లు పొందినవారి వివరాలు రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆ ప్రక్రియేది కొనసాగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. అధికారులు కూడా రైతుబంధుపై తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు. రైతుబంధు అందిస్తే పూర్తిగా వానలు పడే నాటికి ముందస్తులు పనులు చేసుకోవచ్చని అంటున్నారు.
రుణాలివ్వట్లే.. రైతుబంధు రావట్లే..
జూన్ మొదటి వారంలోనే రైతుబంధు ఇవ్వాలి. మూడోవారం పూర్తవు తున్నా ఇంతవరకూ పెట్టుబడి సహాయం ఊసులేదు. ప్రభుత్వం రూ.లక్ష పంట రుణాలు మాఫీ చేస్తామని రూ.25వేల మాత్రమే చేసింది. దీనివల్ల బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితిలేదు. గత్యంతరం లేక రైతులు బయట నూటికి రూ. 2 నుంచి ఐదారు వరకు అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుని పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు.
- కన్సోత్ ధర్మ, తెలంగాణ రైతుసంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి
బయట అప్పులు భారమవుతున్నాయి...
గతేడాది మూడు ఎకరాల మిర్చి వేస్తే నల్లి వచ్చి పాడుపాడు చేసింది. ఆ తర్వాత వంకాయ, బెండకాయ వేసినా నల్లి నాశనం చేసింది. దాదాపు రూ.3లక్షలకు పైగా అప్పైంది. ఈ ఏడాది పత్తి వేద్దామంటే పెట్టుబడి డబ్బులు లేవు. బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు. బయట నూటికి రూ.2 వడ్డీకి అప్పు తీసుకొచ్చి పత్తి గింజలు కొనుక్కొచ్చా. రైతుబంధు వస్తే నాకీ పరిస్థితి ఉండేది కాదు. చూసిచూసి యాష్టకొస్తుంది. రోజూ టీవీల వార్తల్లో రైతుబంధు కబురేమైనా చెబుతారేమోనని ఆశగా చూస్తున్నా.
- గుగులోతు హరి,పుఠానితండా, రఘునాథపాలెం