Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక భద్రత కరువు
- లైంగిక వేధింపులు..అరకొర వేతనాలు ొ అక్కరకు రాని కార్మిక చట్టాలు
- ధరల భారం..బతుకు కష్టం
- ఆదాయం లేక అప్పులతో నెట్టకొస్తున్న గృహ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటి పని చేసుకుంటూ బతుకుతున్న ప్రభ, విజయలక్ష్మి, సద్దార్బేగం,సుజాత వంటి ఇంటి పనివారల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇతరుల ఇళ్లు ఊడ్చి, నేల కడిగి, వంటచేసి జీవనం సాగించే ఇంటి పనివారి బతుకంటే ఎలాగుంటుంది? అంటే ఇంటి యజమానుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఉండమంటే ఉండాలి. పొమ్మంటే పోవాలి. ఇచ్చే జీతానికి వెట్టి చేయించేవారు కొందరైతే.. తిట్లు పెట్టి పంపించేవారు ఇంకొందరు. జీతం పెంచమంటే రేపటి నుంచి రావాల్సిన పనిలేదంటూ మొహం మీదే చెప్పేవారు మరికొందరు.
రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందంటున్నాం. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఎత్తైన అపార్టుమెంట్లు, విశాలమైన ఇండ్లున్నాయి. కానీ.. అదే నగరంలో విస్తారమైన బస్తీలు, మురికివాడలున్నాయి. ఆ వాడల్లో, బస్తీల్లో అద్దె ఇండ్లలో బతుకుతున్న వీరి గురించి ఎవరూ ఎక్కడా ప్రస్తావించరు. ముఖ్యంగా సుమారు ఆరు లక్షలమంది ఇంటి పనివారి జీవితాల గురించి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు.
పేదరికానికి కేరాఫ్ వీరే..
వీరంతా సమాజంలోని పేద వర్గాల నుంచి వచ్చిన దళిత, ముస్లిం, వెనుకబడ్డ తరగతులనుంచి వచ్చిన వారే. గ్రామాల్లో వ్యవసాయం సంక్షోభంలో పడటం, వీరికి సొంత భూమి లేకపోవటం, వ్యవసాయ రంగంలో యంత్రాలు ప్రవేశించటం వల్ల పట్టణాలకు వలసొచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇందులో 99శాతం మహిళలు, బాలికలే. వీరిలో సుమారు 35శాతం మంది వితంతువులే. భర్త నుంచి దూరమైన వారు, ఇతర కుటుంబ సమస్యలతో ఒంటరిగా జీవిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. వీరి శ్రమ ఇతర రంగాల్లోని కార్మికుల్లాగా బహిరంగంగా కనిపించదు. ఇంటి లోపలే పనిచేయాలి. వీరి కష్టానికి న్యాయమైన విలువ కట్టే పద్దతులు అమల్లో లేవు. ఎలాంటి ఒప్పందం లేకుండానే..అనామత్‌గా నియమితులై శ్రమ చేస్తుంటారు. పెరుగుతున్న ధరలతో సరిపోల్చని వేతనాలతో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నారు.
ఇదెక్కడి న్యాయం ?
ఒక ఇంటిలో ఇంటి పనివారిగా చేరాలంటే ముందుగా స్థానిక పోలీసుస్టేషన్లో వారి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వారి పేరు, ఇంటి అడ్రస్, స్థానికంగా వారికున్న పరిచయాలు, వేలి ముద్రలు, గత చరిత్ర తెలపాల్సి ఉంటుంది. కానీ యజమానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రం ఇంటి పనివారికి తెలపరు. ఇదెక్కడి న్యాయం? అంతేకాదు యజమాని ఇంటిలో ఏదైనా వస్తువు పోతే ముందుగా అనుమానించబడే వ్యక్తులు ఇంటి పనివారే. వెంటనే వారిపై 'దొంగ' అనే ముద్ర పడిపోతుంది. ఒక్కోసారి యజమాని చేసే తప్పులను తమపై వేసుకుని, చట్టపరమైన శిక్షలూ అనుభవించిన ఘటనలూ ఉన్నాయి. దీనంతటికీ కారణం వారు అట్టడుగువారు కావడం.. కార్మికులుగా గుర్తింపు లేకపోవడమే.
శ్రమకు గుర్తింపేది ?
ఇంటి పనివారు ముఖ్యంగా ఇంటిని శుభ్రపరచడం, పాత్రలు కడగడం, వంట, పిల్లల, వృద్ధుల సంరక్షణలాంటి పనులను చేస్తుంటారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కుటుంబపోషణ కోసం పట్టణాలకు వలస వచ్చిన అట్టడుగు వర్గాలకు చెందినవారే అధికం. వారు రోజంతా కష్టపడినా పనికి తగిన గుర్తింపు లేదు. రాష్ట్రంలో సుమారు 12లక్షల మంది ఉంటే..నగరంలోనే సుమారు ఆరు లక్షల మంది ఇంటి పనివారులున్నారు. వీరిలో వారాంతపు సెలవు లేకుండా సుమారు 70శాతం మంది పని చేస్తున్నారని తెలిసింది. వేతనంలో ఏ మాత్రం పెంపు లేకుండా 87.8శాతం ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి.ఇందులో 12.75శాతం మందికి సామాజిక పథకాలు అందటం లేదని చెబుతున్నారు. పని ప్రాంతంలో లైంగిక వేధింపులకు గురవుతున్నవారు 2.8శాతం మంది ఉన్నారని ఒక ప్రయివేటు సర్వే తేల్చింది.ఈ విషయాలపై నోరు విప్పని వారు చాలా మందే ఉంటారని అంచనా.
సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఏది?
రాష్ట్రంలో అందరూ సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారనీ, దీంతో రాష్ట్రం బంగారు తెలంగాణగా ప్రసిద్ది చెందిందని పాలకులు పదేపదే చెబుతున్నారు. కానీ..ఇంటి పనివారికి సంక్షేమ పథకాలతోపాటు ఎలాంటి చట్టబద్ద సౌకర్యాలు అందటం లేదు. ఉండటానికి ఇండ్లు లేక కట్టలేని కిరాయిలతో సతమతమవుతున్నారు. వీరికి రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని ఎన్నికలప్పుడు సర్కారు చెప్పిన మాట నీటి మూటగా మిగిలిందని వారు వాపోతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రేషన్ కార్డులు, ప్రసూతి సౌకర్యాలు, పిల్లలకు స్కాలర్షిప్లు, అదనపు పనికి అదనపు వేతనం తదితర కోర్కెలను పరిష్కరించేందుకు సర్కారు కృషి నామమాత్రమేనన్న అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పట్టించుకోవాలి
2011లో అంతర్జాతీయ గృహ కార్మికుల రక్షణ కోసం ఐఎల్ఓ కన్వెన్షన్ సి189/చట్టాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇంటి పనివారి రక్షణ మెరుగు దలకు కృషి చేస్తున్నారు.కానీ..మన రాష్ట్రంలో ఇంటి పనిచేసే మహిళల పరిస్థితి మారలేదు.ఆర్థికంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావటంలేదు. ఈఎస్ఐ, పీఎఫ్‌లాంటి చట్ట బద్ద సౌకర్యాలు అసలే లేవు. కనీసం గుర్తింపు కార్డులైనా ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించాలి
- కెఎన్ ఆశాలత, కన్వీనర్
స్నేహ ఇంటిపనివారల సంఘం(ఐద్వా)