Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సైన్యంలో రిక్రూట్మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడతామని తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు వెల్లడించాయి. శనివారం హైదరబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ... కేంద్రం ఈ పథకాన్ని కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిందన్నారు. దేశ భద్రతను తాకట్టుపెట్టేలా ఉందని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసేందుకు పూనుకోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురయ్యారని తెలిపారు. అభ్యర్థుల మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనీ, గాయపడిన వారికి పూర్తి వైద్యం అందించాలని కోరారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 21న జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్, సహాయ కార్యదర్శి బొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. ఆంజనేయులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శులు మూడ్‌శోభన్, లెల్లెల బాలకష్ణ, డి.బాల్‌రెడ్డి, గఫూర్, మాటూరి బాల్‌రాజ్‌గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, ఎ. రాములు, జిఎస్. గోపి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కంసానిపల్లి నిరుపేదలకు పట్టాల్విండి
ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్‌కు రైతుసంఘం వినతి
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని కంసానిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 229 పరిధిలోని 1024 ఎకరాలకు పట్టాలివ్వాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. 130 ఏండ్లుగా (నాలుగు తరాలు) సుమారు 426 నిరుపేద కుటుంబాలు ఆభూమిని సాగు చేసుకుంటున్నాయనీ, వారికి పట్టాలివ్వాలని డిమాండ చేసింది. వర్రెలు, వంపులు, రాళ్ళు, రప్పలు, బోళ్లు ఉన్న ఆ భూములను దళిత, గిరిజన, బలహీన వర్గాలకు పేదలు చదును చేసి సేద్యం చేసుకుంటున్నారని తెలిపింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి శనివారం ఈమేరకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కొంతమంది రైతులకు 30 ఏండ్ల క్రితమే అప్పటి ప్రభుత్వాలు పాస్‌బుక్కులు ఇచ్చాయని తెలిపారు. ఆ భూమిని ఆహారశుద్ధి పరిశ్రమలకు కేటాయిస్తామంటూ ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తూ...పేదలను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. రెండు నెలల నుంచి రైతులు తహశీల్దారు కార్యాలయం ముందు రిలేనిరాహార దీక్షలు చేస్తున్నారని గుర్తు చేశారు. 426 పేద కుటుంబాలకు భూమిహక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ధరణి పాస్‌బుక్కులు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, వెంటనే పేదల ఆందోళనలను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు.