Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని జంతువుల కోసం బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆల్ ఫర్ ఎనిమల్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీలక్ష్మి భూపాల్, ఎనిమల్ బ్లడ్ లైన్ ఫౌండర్ శివ కుమార్ వర్మతో ఆయన భేటీ అయ్యారు. జంతువుల పట్ల ప్రభుత్వ పరంగా ఎన్జీవో సంస్థలకు అందజేయాల్సిన చేయూత గురించి వారు చర్చించారు. ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లుల వంటి అనేక జంతువులకు రక్తహీనత ఏర్పడినప్పుడు గానీ, ప్రమాదాల్లో రక్తస్రావం జరిగినప్పుడు గానీ అందుబాటులో రక్తం లభ్యం కాకపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని శ్రీలక్ష్మీభూపాల్, శివకుమార్ వర్మ వివరించారు. అమెరికా, యూకే. దేశాలలో ఎనిమల్ ఫౌండేషన్లు జంతువుల బ్లడ్ బ్యాంకుల నిర్వహణ నైపుణ్యాన్ని, అవసరమైన ల్యాబ్ సామాగ్రిని అందించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారులోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో జంతువుల బ్లడ్ బ్యాంక్ సహా జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం బ్లడ్ రీసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారికి హామీనిచ్చారు. ఈ నేపథ్యంలోనే పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హ, వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ రెడ్డిలతో వినోద్ కుమార్ మాట్లాడారు.