Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎస్‌జీసీసీఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జాబితాను ప్రభుత్వానికి త్వరగా పంపే విషయంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ఆర్థిక, ఉన్నత విద్యా శాఖ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం వివరాలు పంపాలంటూ మూడు నెలల క్రితమే ఇంటర్ విద్య కమిషనర్‌కు లేఖలు పంపాయని తెలిపారు. ఆ జాబితాను ప్రభుత్వానికి పంపించడంలో జాప్యం చేస్తూ అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న ఇంటర్ కమిషనర్ చేస్తున్న ఆలస్యంపై జోక్యం చేసుకోవాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను ప్రభుత్వానికి త్వరగా పంపే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ కాంట్రాక్టు అధ్యాపకులు ఆందోళన చెందొద్దన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌జీసీసీఎల్‌ఏ రాష్ట్ర నాయకులు గంగాధర్, మనోహర్, నరసింహరాజు, హరి తదితరులు పాల్గొన్నారు.