Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగు సాహిత్యరంగంలో అనేక నూతన ప్రక్రియలు చోటుచేసుకుంటూ తెలుగు భాషను నిత్యనూతనంగా మార్చుతున్నాయని విశ్వసాహితీ ట్రస్ట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సంక్లిష్టంగా ఉండే శతకాల కంటే సరళంగా ఉండే శతకాలపై పాఠకులకు మక్కువ ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. చందస్సు సహిత కావ్యగ్రంధాల కంటే సూక్ష్మంలో మోక్షం మాదిరిగా 12పంక్తుల్లో కావ్యాన్ని చదివిన అనుభూతిని ఇచ్చే సూక్ష్మకావ్య ప్రక్రియకు ఆదరణ పెరిగిందని తెలిపింది. తెలంగాణ సీనియర్ ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశం తెలుగు సాహిత్యరంగానికి ఈ ప్రక్రియను పరిచయం చేశారని తెలిపింది. ''అమ్మ నాన్న'' పై ఆయన రచించిన సూక్ష్మ కావ్యం విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నది. ఈ రెండు ప్రక్రియల్లో రచనలు చేసిన రచయితలకు వెంకటేశం తల్లి బుర్రా గౌరమ్మ తొలి వర్ధంతి సందర్భంగా బహుమతి ప్రదానం చేయనున్నారు. సూక్ష్మ కావ్యం రచయితలకు తండ్రి బుర్రా నారాయణ పేరు మీదుగా, సరళ శతకం రచయితలకు అమ్మ బుర్రా గౌరమ్మ పేరు మీద బహుమతులను అందిస్తారు. మే 2021 నుంచి మే 2022 వరకు ప్రచురించ బడిన సూక్ష్య కావ్యాలలో, సరళ శతకాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ బహుమతులు, ఒక ప్రోత్సాహక బహుమతి అందిస్తారు. ''విశ్వ సాహితీ ట్రస్ట్'' ఆధ్వర్యంలో జూలై నెలలో హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని ట్రస్ట్ తెలిపింది. ఆసక్తి గల రచయితలు తమ కావ్యాలను ఈనెల చివరిలోగా పంపించాలని పేర్కొన్నది. మరిన్ని వివరాల కోసం 9154102734 ఈ నెంబర్కు సంప్రదించవచ్చని తెలిపింది.