Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరెక్టు ఛాతిలో కాల్చే హక్కు ఎవరిచ్చారు?
- సికింద్రాబాద్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేసే క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన కుట్ర కాదనీ, దేశంలోని నిరుద్యోగుల్లో, యువతలో పెరిగిపోతున్న ఆక్రోశానికి నిదర్శనమని టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. ఇప్పటికైనా పాలకులు నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు ఆగ్రహంతో ఉన్న సమయంలో పోలీసులు సమయస్ఫూర్తి ప్రదర్శించి ఉండాల్సిందన్నారు. బాష్పవాయువు, రబ్బరుబుల్లెట్లు ప్రయోగించి ఆందోళనకారులను భయపెట్టే అవకాశమున్నా..డైరెక్టుగా ఛాతిలో ఎలా కాలుస్తారు? అలా చేయాలని ఏ చట్టంలో ఉంది? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వటాన్ని, అంతిమయాత్రలో మంత్రులు పాల్గొనటాన్ని స్వాగతించారు. అయితే, రాష్ట్రంలో ఏ నిరుద్యోగి చనిపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలబడితే వారి చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుందన్నారు. బాసర విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని వారం నుంచి ప్రశాంతంగా తమ నిరసన తెలుపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు స్పందించకుంటేనే విద్యార్థులుగానీ, నిరుద్యోగులుగానీ తిరుగబడతారని చెప్పారు. సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర సిద్ధాంతం ఉందనే మాటల్ని బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు.