Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే నూతన ఒప్పందం చేయాలి
- విచ్ఛిన్నకర సంఘాలతో కార్మికులు జాగ్రత్తగా ఉండాలి
- తెలంగాణ బీడీ టేకేదార్ల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో రమ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పెరిగిన ధరలకు అనుగుణంగా బీడీ టేకేదార్లకు 25 శాతం కమీషన్ ఇవ్వాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ డిమాండ్ చేశారు. కమీషన్ ఒప్పంద కాలం పూర్తవుతున్నా.. నూతన ఒప్పందం చేసుకోవడంలో యజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ బీడీ టేకేదార్ల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీడీ టేకేదార్లకు కనీస వేతనం కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. టేకేదార్లు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విచ్ఛిన్నకర శక్తులతో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో వేలాది మంది టేకేదార్లు పని చేస్తున్నారని, చాలీచాలని వేతనాలతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 25 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టేకేదార్లతో యాజమాన్యాలు నూతన అగ్రిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. అన్ని కంపెనీల యాజమాన్యాలు వివిధ పద్ధతుల్లో మోసం చేస్తున్నాయని వివరించారు. పాత ఒప్పందంలో ఒప్పుకున్న డిమాండ్లను సైతం పూర్తిగా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల రోజువారి కూలిలో వివిధ పద్ధతుల్లో రూ.3 నుంచి రూ.8 వరకు యాజమాన్యాలు దోపిడీ చేసుకుంటూ టేకేదార్లను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. టేకేదార్లకు పీఎఫ్ నంబర్ మంజూరు చేసి గుర్తింపు కార్డు ఇవ్వాలని అన్నారు.
టేకేదార్ల నుంచి డిపాజిట్ల రూపంలో తీసుకున్న డబ్బులను వెంటనే బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. టేకేదార్లందరికీ ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని.. ఈ డిమాండ్లను నెరవేర్చడంతో పాటు నూతన అగ్రిమెంట్ వెంటనే చేయాలని యజమాన్యాలను డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టి వివిధ కేటగిరీల కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. కేంద్ర సర్కారు బీడీ పరిశ్రమపై అనేక రకాల ఆంక్షలు విధిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, బీడీ పరిశ్రమ యాజమాన్యాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టేకేదారులందరూ ఐక్యంగా పోరాటాలు చేసి తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య, రాష్ట ఉపాధ్యక్షులు కె.గోపాలస్వామి, నుర్జాహన్, బాలమణి, కోశాధికారి జి.భాస్కర్, కామారెడ్డి జిల్లా సిఐటియు కన్వీనర్ కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.