Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్ పథకంతో యువతకు అన్యాయం
- మోటూరు వర్థంతి సభలో సారంపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాదాన్ని సైన్యంలో ప్రవేశపెట్టే తలంపుతోనే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారనీ, ఈ పథకంద్వారా నియమితులైన వారు నాలుగేండ్లు మాత్రమే విధుల్లో ఉంటారని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఈ పద్దతి యువతకే కాక, దేశ భద్రతకు తీవ్ర ప్రమాదమని ఆయన విమర్శించారు. దేశంలో కుల, మత అణచివేతలకు అవకాశం లేకుండా సమసమాజాన్ని నిర్మించాలని మోటూరు హనుమంతరావు కలలు గన్నారని చెప్పారు. ఎమ్హెచ్ 21వ వర్థంతి సభ శనివారం హైదరాబాద్లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సారంపల్లి మల్లారెడ్డితోపాటు సంపాదకులు ఆర్ సుధాభాస్కర్, సీజీఎం పి ప్రభాకర్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారంపల్లి మాట్లాడుతూ దేశ ప్రయోజనాలకంటే యువతను బీజేపీ సైనికులుగా తయారు చేసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని విమర్శించారు.ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచబ్యాంకు లాంటి సంస్థల ఒత్తిడి మేరకు భారత ప్రభుత్వం అగ్నిపథ్లాంటి పథకాలను తీసుకొచ్చి యువతను తప్పుదారి పట్టిస్తున్నదనీ, రైతాంగాన్ని దివాళా తీయించే మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని అప్పుడే ఎమ్హెచ్కు నిజమైన నివాళని చెప్పారు. మోటూరు 1937లో శాఖ కార్యదర్శి మొదలు రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా అనేక బాధ్యతల్లో పనిచేసినప్పటికీ సాధారణమైన ఆదర్శ జీవితాన్ని గడిపారని చెప్పారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఐ(ఎం) విడిపోయినప్పుడు మితవాదానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటాన్ని నిర్వహించినవారిలో ఎమ్హెచ్ ఒకరని తెలిపారు. నాటి ప్రభుత్వం అక్రమంగా ఆయన్ను అరెస్టు చేసి 16 మాసాలు జైల్లో పెట్టిందని గుర్తు చేశారు. ఆ తర్వాత పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు.
తిరిగి 1967లో అతివాద ధోరణులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సైద్ధాంతిక పోరాటం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు కూడా ఎంహెచ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. 1952-54 మధ్య శాసన సభ్యునిగానూ, 1978-84లో శాసన మండలి సభ్యునిగా, 1988-94 మధ్య రాజ్యసభ సభ్యునిగా పదవులు నిర్వహించారని గుర్తుచేశారు. అయినా ఏనాడు ఆడంబరాలకు పోలేదనీ, నిరాండంబర జీవితాన్ని కొనసాగించారని చెప్పారు. విశాలంధ్రలో విషాదఛాయలు అనే పుస్తకం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపారని తెలిపారు.1953లో విశాలాంద్ర సంపాదకులుగా, 1963లో జనశక్తి సంపాదకులుగా,1968లో ప్రజాశక్తి సంపాదకులుగా పనిచేశారని చెప్పారు. పార్లమెంటరీ రంగంలోనే కాక,పత్రికా రంగంలోనూ ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని వివరించారు. సిద్ధాంతాన్ని ఆచరణకు మేళవించి పనిచేసిన ఆయన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త నేడు పనిచేయాల్సిన అవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. సుధాభాస్కర్ మాట్లాడుతూ ఎమ్హెచ్ పత్రికా సంపాదకుడిగా ఉంటూనే పార్టీలో వివిధ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించారని గుర్తుచేశారు.అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని చెప్పారు. ప్రభాకర్ మాట్లాడుతూ పత్రికా రంగం ద్వారా ప్రజాతంత్ర భావాజాలాన్ని ప్రచారం చేయటంలో ఆయనకు ఆయనే సాటని చెప్పారు. అనేక ఒడుదొడుకులను తట్టుకుని పత్రికను నిలబెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు రఘు, ఆర్ వాసు, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు ఆనందాచారి తదితరులు పాల్గొన్నారు.