Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులను ఐక్యం చేసింది సుబ్బారావు అని అనుమానం
- నర్సారావుపేటకు తరలింపు..?
నవతెలంగాణ-ఖమ్మం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి కారకుడని అనుమానిస్తున్న నర్సరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖమ్మంలో అరెస్టు చేసినట్టు సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి ఆయనే వ్యహకర్తగా అనుమానిస్తున్న పోలీసులు, సంఘటన జరిగిన తరువాత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రధాన సుబ్బారావును ఖమ్మంలో అరెస్టు చేసి నర్సరావుపేటకు తరలించినట్టు సమాచారం. ఆర్మ ఉద్యోగాల ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌పై యువకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ సందర్భంలో మూడు నాలుగు రోజులుగా వాట్సాప్ కేంద్రంగా యువకులు ఐక్యమైనట్టు తెలుస్తోంది.ఈ గ్రూపు క్రియేట్ చేయడం, యువకులంద రూ ఒకే సారి రైల్వే స్టేషన్లో నిరసన తెలిపేందుకు సుబ్బారావే వారిని ప్రేరేపించినట్టు సమాచారం. ఆవుల సుబ్బారావును విధ్వంస వ్యూహంలో కీలక వ్యక్తిగా భావించి అతని అరెస్టుకు పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్‌పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్టుగా సమాచారం సేకరించిన నిఘా బృందం, అధికారుల ఆదేశాల మేరకు శనివారం తెల్లవారు జామున సుబ్బారావును ఖమ్మం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచి నర్సరావుపేటకు తరలించినట్టు సమాచారం.