Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
- పార్లమెంటులో చర్చలేకుండా ఎలా ప్రకటించారు? : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటులో చర్చ లేకుండా ఈ పథకాన్ని ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయానికి యువకులు బలవుతున్నారని ఆరోపించారు. అన్నివిధాలా ఆలోచించి, చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్ సర్వీసును కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సైనికులను నాలుగేండ్ల ప్రాతిపదికన నియమించడం దారుణమన్నారు. రైతులు దేశానికి వెన్నెముక అని.. సైనికులు దేశ రక్షణ అనే గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. పార్లమెంట్లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను... చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్‌లోకి తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యంలో చేరికలను ఔట్సోర్సింగ్ ద్వారా చేపట్టడాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని గుర్తు చేశారు. అందులో భాగమే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన అని తెలిపారు. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకుని పరీక్షలకు సిద్ధమైన యువకుల పట్ల మోడీ ప్రభుత్వం నిరంకుశత్వ వైఖరితో వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోవడంతో పాటు ఐదుగురికి గాయాలయ్యాయనీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధితులను పరామర్శించకుండా అమిత్‌షా దగ్గరకు వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్ స్టేషన్లో అల్లర్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్ పిలుపునిస్తే టీఆర్ఎస్, ఎంఐఎం దాడి చేశాయా? అని నిలదీశారు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా? అని ప్రశ్నించారు. వారణాసిలో కూడా దాడులు జరిగాయనీ, అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ చేయించిందా? అని ఎద్దేవా చేశారు.
బాధితులను పరామర్శించిన రేవంత్
గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ ఘటన బాధితులను పీసీసీ చీఫ్ రేవంత్ పరమర్శించారు. ఆయన్ను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసుల కండ్లుగప్పి ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ అవగాహనరాహిత్యం వల్లే ఆ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. అవసరమైతే అపోలో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అందుకు అయ్యే ఖర్చు కాంగ్రెస్ భరిస్తుందన్నారు.