Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చలు సఫలమన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- కేటీఆర్ హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామంటున్న విద్యార్థులు
- పరిపాలనాధికారి తొలగింపు
నవతెలంగాణ-బాసర
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఐదో రోజూ తమ పోరాటాన్ని కొనసాగించారు. తాము లేవనెత్తిన 12 సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులు ఎండలోనూ, వర్షంలోనూ తడుస్తూ నిరసన తెలిపారు. శనివారం సాయంత్రం యూనివర్సిటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్‌కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సమావేశమయ్యారు. తమ 12సమస్యలను పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తానని విద్యార్థులు తెగేసి చెప్పారు. అయితే, సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని లేఖ విడుదల చేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన చర్చలు వెల్లడించారు. విద్యార్థులు లేవనెత్తిన 12 సమస్యల్లో వైస్ ఛాన్స్లర్ నియామకానికి సమయం పడుతుందని, మిగతా 11 సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు హామీ ఇచ్చామన్నారు. విద్యార్థులకు తరగతి, వసతి గదుల మరమ్మతులు, ఇంటర్నెట్, లాప్ టాప్, ప్లేస్మెంట్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరసన విరమించాలని, సోమవారం నుంచి తరగతి గదులకు హాజరవుతామని హామీ ఇచ్చారని చెప్పారు.
మంత్రి కేటీఆర్ రాతపూర్వక హామీ ఇస్తేనే నిరసన విరమిస్తాం : విద్యార్థులు
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని తెగేసి చెప్పారు. మరో పక్క శనివారం రాత్రి యూనివర్సిటీ పరిపాలనాధికారి వై.రాజశ్వర్రావును విధుల నుంచి తొలగిస్తూ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు.