Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బాసర
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేయనున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సామరస్యంగా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా 24 గంటలపాటు నిరసన దీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. రాత్రంతా దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. గతంలో మంత్రులు, యూనివర్సిటీ అధికారులు హామీనిచ్చి వెళ్లిపోయారే తప్పా తమ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పీయూసీ ఒక సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు అధికారులు అవుట్ పాసులు ఇచ్చి ఇంటికి పంపించే యోచనలో ఉన్నారు. ఇందుకుగాను ఆయా విద్యార్థులకు సమాచారం సైతం అందించారు. విద్యార్థులు తక్షణమే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. విద్యార్థులు తమ నిరసన విరమించుకోకపోవడంతో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.