Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే ఎస్పీ అనూరాధ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి కేసులో నిందితులంతా తెలంగాణకు చెందినవారేనని రైల్వే ఎస్పీ బీ అనూరాధ తెలిపారు. 46 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. వీరందరికీ జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఈ విధంగా ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఆదివారంనాడామె మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన 17వ తేదీ ఉదయం 8 గంటలకు రైల్వే స్టేషన్లోకి 300 మంది చొరబొడ్డారనీ, వారంతా ఈస్ట్ కోస్ట్, థన్పూర్ రైళ్లలో వచ్చారని చెప్పారు. వారి దాడిలో 30 రైలు బోగీలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఒక బోగీని పెట్రోల్ పోసి కాల్చేశారనీ, అగ్నిపథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని వివరించారు. దాదాపు రెండువేల మంది ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొన్నవాళ్లేననీ, మూడుసార్లు వీళ్ళకు ఆర్మీ పరీక్ష రద్దు అయ్యిందని చెప్పారు. వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్లే వాళ్లను తప్పుడు దారిలో వెళ్లేందుకు రెచ్చ గొట్టారని అన్నారు. వాట్సప్ గ్రూపుల ద్వారా సమీకరణ జరిగిందన్నారు. రైల్వే స్టేషన్లో లోకో ఇంజిన్, 4 వేల లీటర్ల ఆయిల్ ఉందనీ, వాటికి నిప్పుపెడితే ఎక్కువ మరణాలు జరుగుతాయనే తాము కాల్పులు జరిపామని వివరణ ఇచ్చారు. ఫైరింగ్‌లో ఒక బుల్లెట్ మాత్రమే వాడామనీ, మిగిలిన 20 రౌండ్స్ పిల్లేట్స్ వినియోగించామన్నారు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) వాళ్లే కాల్పులు జరిపారన్నారు. మొత్తం 58 బోగీలకు నష్టం జరిగిందనీ, రూ.12 కోట్ల వరకు అంచనా వేశారని చెప్పారు. నిందితులపై ఒకసారి రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే ఇక వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌లు ఉన్నాయనీ, వాటిని పరిశీలిస్తున్నామన్నారు. తొమ్మిదిమంది రైల్వే సిబ్బంది గాయపడ్డారనీ, కేసులను హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేసినట్టు వివరించారు.