Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే ఆ పథకాన్ని రద్దు చేయాలి
- కాంగ్రెస్ సత్యగ్రహ దీక్షలో మహేశ్‌కుమార్‌గౌడ్
- బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం :
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం...సైనికులను అవమానించడమేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ప్రజాదోళనలను దృష్టిలో ఉంచుకుని వెంటనే కేంద్రం దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రక్షణశాఖలో కాంట్రాక్టు విధానం తీసుకరావడం దారుణమన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. అగ్నిపథ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశసేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పెన్షన్, ఆర్థిక భారం తగ్గించుకునేందుకే కేంద్రం ఏకంగా రక్షణ శాఖనే ఎంచుకున్నదని విమర్శించారు. దేశ పరిస్థితి ఏ విధంగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించడం రక్షణశాఖతోపాటు సైనికులను అవమానపరచడమేనన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. దీంతో మిలటరీని నాలుగేండ్లపాటు కాంట్రాక్టు వ్యవస్థగా మారుస్తున్నారని విమర్శించారు. కోట్లాది మంది యువకులు నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తోందనీ, బీజేపీ నుంచి ఆర్మీని రక్షించుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. సేవ్ ఆర్మీ పేరుతో ముందుకు పోవాలని కోరారు. అగ్నిపథ్‌ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సైనికులకు పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా? అని నిలదీశారు. మాజీ మంత్రి జె గీతారెడ్డి మాట్లాడుతూ మోడీ తీసుకొస్తున్న పథకాలు తన మిత్రులైన అదానీ, అంబానీ కోసమేన్నారు. శ్రీలంకలోనూ తన మిత్రుడి కోసం ఆయన పైరవీ చేశారని ఆరోపించారు. దేశ సేవ చేయడానికి ముందుకొచ్చిన సైనికుల నోట్లో మట్టికొట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రి జి చిన్నారెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు, అనిల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.