Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తిండిపోయే కొద్దిమందిలో ఆమె ఒకరు
- ప్రజారోగ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడాలి
- డాక్టర్ శ్యామలాంబ సంస్మరణ సభలో
డాక్టర్ రాజేశ్వర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిలోఫర్ ఆస్పత్రి పీడియాట్రిక్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ శ్యామలాంబ డాక్టర్లకు ఆదర్శప్రాయురాలని నెల్లూరు ప్రజావైద్యశాల డాక్టర్ రాజేశ్వర్రావు కొనియాడారు.ప్రజారోగ్య పరిరక్షణ వేదిక నాయకులు ముకుంద్ కులకర్ణి అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రి ఆడిటోరియంలో శ్యామలాంబ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భం గా డాక్టర్ రాజేశ్వర్రావు మాట్లాడుతూ అన్ని వృత్తుల్లో చాలా మంది ఉంటార నీ, అయితే కొద్ది మందిని మాత్రమే ప్రజలు గుర్తు పెట్టుకుంటారనీ, అలాంటి వారిలో శ్యామలాంబ ఒకరని తెలిపారు. ఆమె తన జీవితాన్ని పేదలకు వైద్యసేవలందించేందుకు అంకితం చేశారని చెప్పారు. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న నాయకులు, కార్యకర్తలకు ఆమె వైద్యం అందించారని గుర్తుచేశారు. నెల్లూరులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రారంభించిన ప్రజా వైద్యశాల తన సేవలను విస్తరించి ఏ విధంగా చికిత్సలందిస్తుందో ఆయన వివరించారు. ప్రజలందరికీ అవసరమైన ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని రాజేశ్వర్ రావు స్పష్టం చేశారు. ప్రజారోగ్యా నికి ప్రభుత్వాలు జీడీపీలో ఒక శాతం మాత్రమే కేటాయిస్తున్నారనీ, దాన్ని కనీసం మూడు నుంచి ఐదు శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక విధానాలు రాకమునుపు 80 శాతం వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండగా, ప్రయివేటులో 20 శాతం ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడది తిరగబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో తగినంతగా మానవవనరులు, ఔషధాలు లేవని విమర్శించారు. ప్రభుత్వాలే ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు ను ప్రోత్సహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేగు, హెచ్ఐవీ, కరోనా మహమ్మారుల సమయంలో వైద్యానికి ప్రయివేటు ఆస్పత్రులు నిరాకరిస్తే ప్రజలను ప్రభుత్వ వ్యవస్థే కాపాడిందని గుర్తుచేశారు. కరోనా సమయంలో వైద్యసదుపాయాలు సకాలంలో అందకపోవడంతోనే చాలా మంది చనిపోయారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలని హితవు పలికారు. ప్రజారోగ్య వ్యవస్థ పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ దాసరి ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రతి డాక్టరు తన పరిధిలో చేయగలిగినంతగా పేదలకు సేవ చేయాలని సూచించారు. విదేశాలకు వెళ్లే డాక్టర్లు అక్కడి ఆధునిక వైద్యాన్ని మనదేశ సామాన్యులకు చేరువ చేసే దిశగా ఆలోచన చేయాలని కోరారు. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ మాట్లాడుతూ ప్రయివేటు ఆస్పత్రులను జాతీయం చేసినప్పుడే దేశంలోని అందరికి సమానమైన వైద్యం అందుతుందని తెలిపారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం మంది ప్రభుత్వ సేవలపైనే ఆధారపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిషన్ డాక్టర్ కొండారెడ్డి తదితర డాక్టర్లు శ్యామలాంబతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శ్యామలాంబ భర్త బసవరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.