Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చుక్క రాములు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికవర్గ హక్కుల కోసం అస్థిత్వ ధోరణులపై ఐక్య ప్రతిఘటనోద్యమం నిర్మించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఎస్వీకేలో సీఐటీయూ రాష్ట్ర శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికవర్గ హక్కులపై దాడి చేస్తోందనీ, గుత్త పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల లాభాలకోసం కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చేశారని విమర్శించారు. వ్యవసాయ, పారిశ్రామిక సేవారంగాలను ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం సైన్యంలో నియామకాలను కూడా ఒప్పంద పద్ధతిలో చేయడం వల్ల ప్రయివేటీకరణ పరాకాష్టకు చేరిందని తెలిపారు. దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి దేశ రక్షణకు భద్రత లేకుండా చేయడం బీజేపీకే చెల్లిందని దుయ్యబట్టారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళనల్లో పాల్గొనడం అందులో భాగమేనని చెప్పారు. కార్మిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ బీజేపీ మందిరాలు, మసీదులు, ఆహారపు అలవాట్లపై వివాదాలు సృష్టిస్తూ ప్రజల్లో అనైక్యతను పెంచి పబ్బం గడుపుకుంటున్నదన్నారు. దేశ ఆర్థిక స్వాలంబన, ప్రభుత్వ రంగ రక్షణ, సామాజిక న్యాయం కోసం కార్యకర్తలు రాజకీయ సైద్ధాంతిక స్థాయిని పెంచుకోవాలని సూచించారు. బీజేపీ అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటనోద్యమాలను నిర్మించడం ప్రస్తుత స్థితిలో కీలక కర్తవ్యమని తెలిపారు.
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ క్లాసుల నేపథ్యాన్ని వివరించారు. తొలిరోజు పాఠ్యాంశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య బోధించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, బి.మధు, ఎం.వెంకటేష్, ఉపాధ్యక్షులు ఆర్.కోటంరాజు, కళ్యాణం వెంకటేశ్వర్లు, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.