Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల కార్పొరేషన్లో సిబ్బంది కొరత
- స్త్రీ-శిశు సంక్షేమ శాఖలో విలీనంతో ఇబ్బందులు
- సంక్షేమం పట్టని సర్కారు
- మాటలకే పరిమితమవుతున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదలు, వికలాంగులకు బాసటగా నిలవటమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం అన్నారు. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. -మంత్రి కేటీఆర్
చిన్నప్పటి నుంచే నాకు రెండు కాళ్లు పనిచేయటం లేదు. నాటి నుంచి రెండు చక్రాల బండి సహాయంతో పని చేసుకుంటున్నాను. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో మా వాటా మాకు కావాలని ఎన్నో సార్లు సర్కారు దృష్టికి తీసుకుపోయాము. అంగవైకల్యంతో పుట్టటం మా తప్పుకాదు. మా లాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదే. మా బాధలు అన్నీ ఇన్నీ కావు. ఏం చేయాలన్నా సకలాంగులు చేసినట్టు చేయలేం కదా? మరో పక్క మేమంటే ఈసడింపులు. తక్కువ చూపు. వివక్ష. మమ్ముల్ని మనుషులుగా చూస్తున్నారా? మూరెడు చేసి, బారెడు చేసినట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. చట్టం మాకు కొన్ని హక్కుల్ని కల్పించింది. వాటిని అమలు చేసినా చాలు. అప్పుడే..మా కష్టం, బాధ అర్ధం చేసుకున్నట్టవుతది. మా ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది.
- రాజయ్య, రంగారెడ్డి
ఇదొక రాజయ్య బాధకాదు..రాష్ట్రంలో ఎందరో రాజయ్యలున్నారు. వికలాంగులంటేనే సహకరించని శరీరాలు. ఏ పనిచేయాలన్నా కష్టమే. వీరిని ప్రభుత్వం ఎంతో ఆదుకున్నట్టు ప్రచారం చేసుకుంటుంది. కానీ..ఆచరణలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వీరు ఏదో ఒక చోట నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన ప్రభుత్వమే సరిగా పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి.
కార్పొరేషన్లో సిబ్బంది కొరత..
వికలాంగుల కార్పొరేషన్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు నియామకాలే జరగలేందంటే ఆశ్చర్యమే. పైగా 2014 నుంచి ఇప్పటి వరకు 20మంది పదవీ విరమణ చేశారు. కొత్త నియామకాలు లేవు..పాత వారి స్థానంలో భర్తీ చేయలేదు. కార్పొరేషన్ ద్వారా రెండు రకాల పనులు జరగాలి. పరికరాల ఉత్పతి, వికలాంగులకు శిక్షణ. రాష్ట్రంలో ఉన్న సుమారు 20లక్షల మంది వికలాంగులకు ఈ రెండు పనులు సంపూర్ణంగా జరిగితేనే..వారికి తగిన సహకారం అందుతుంది. అందుకు తగిన సిబ్బంది లేకపోవటంతో వికలాంగుల కార్పొరేషన్ నిర్వీర్యంగా ఉంది. ఉదాహరణకు రాష్ట్రంలో శిక్షణ, ఉత్పత్తి సెంటర్లుంటే..హైదరాబాద్, రంగారెడ్డి సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. సూర్యాపేట, సదాశివపేట,నిజామాబాద్ సెంటర్లు పనిలో లేవు. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో హియరింగ్ మోల్డ్ సెంటరు గతంలో ఉండేది. కానీ..ప్రస్తుతం అది మూత పడింది. సౌండ్ లైబ్రరీలో 30 మంది పనిచేయాల్సిన చోట ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మలక్ పేటలో ఉన్న బ్రెయిలీ ప్రెస్‌లో 30మంది సిబ్బందికిగానూ, ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో అందాల్సిన సంక్షేమం కూడా ఆ మేరకే ఉందన్న విమర్శలు ఉన్నాయి.
విలీనంతో ఇక్కట్లు..
వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయటంతో క్రమంగా వికలాంగుల శాఖ అస్థిత్వాన్ని దెబ్బతీయటమేనన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక శాఖ ద్వారా వారికి తగిన విధంగా పథకాలను అందించాలన్న చట్ట బద్ద నిర్ణయాన్ని తుంగలో తొక్కటమేనన్న అనుమానాలు వికలాంగులు వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం లభించాల్సిన కనీస ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక ఎందరో వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. 1981లో వికలాంగుల కార్పొరేషన్ ఏర్పడింది. 1983లో వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పడింది. ప్రస్తుతం 33 జిల్లాలో కార్యాలయాలున్నప్పటికీ వాటి ద్వారా వారికి అవసరమైన పరికరాలు, ఇతర సంక్షేమ పథకాల అమలు జరగటం లేదు. పరిపాలనా సౌలభ్యం పేరుతో ఎప్పుడైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిందో..అప్పటి నుంచి వికలాంగుల సంక్షేమానికి ఇక్కట్లు మొదలయ్యాయి.
మాటలు కోటలు దాటుతున్నాయి..
సర్కారు మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ..చేతలు మాత్రం గడప దాటటం లేదని వికలాంగులు పెదవి విరుస్తున్నారు. మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తగిన రీతిలో కేటాయింపులు జరగలేదన్న విమర్శ ఉండనే ఉన్నది. రాష్ట్రంలో ఏడు రకాల వైకల్యం కలిగిన వారిని లెక్కిస్తేనే..10,46,820మంది వికలాంగులున్నారు. వాస్తవంగా 21 రకాల వైకల్యం కలిగిన వారిని లెక్కిస్తే తెలంగాణలో సుమారు 20లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. వీరి సంక్షేమం, అవసరాల ఆధారంగా కేటాయింపులు లేవు. ప్రతి బడ్జెట్లో నిధులు పెంచినట్టు అంకెల్లో చూపుతున్నప్పటికీ ఖర్చు చేయట్లేదని సంఘాలు చెబుతున్నాయి.
పెరగుతున్న ధరలతో ఇబ్బందులు..
ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. అందుకు తగిన ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఏకంగా కార్పొరేషన్‌ను మూసేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.అంధుల, భదిరుల కోసం ఉన్న శిక్షణా కేంద్రాలు కూడా మూసివేత దశలో ఉన్నాయంటే వికలాంగుల పట్ల ప్రభుత్వ చిత్త శుద్ధి ఏపాటిదో అర్థమవుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా దరఖాస్తు చేసుకున్న ప్రతి వికలాంగుడికి పరికరాలు పంపిణీ చేయాలి. నిరుద్యోగ వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో వసతితో పాటు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
ఎం అడివయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జాతీయ వికలాంగుల హక్కుల వేదిక(ఎన్పీఆర్డీ)