Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ఆదాయం అంతంతే..
- మే లో రికార్డు స్థాయిలో పని కోరిన 3 కోట్ల కుటుంబాలు
- ప్రజల ఆర్థిక పరిస్థితిపై నిపుణులు, విశ్లేషకుల ఆందోళన
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) గ్రామీణ ప్రాంత ప్రజలకు పనిని కల్పించినా.. వారి కడుపు నింపటం లేదు. ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య 'ఉపాధి' రికార్డుల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. కానీ, వారి ఆదాయాలు మాత్రం ఆశించినంతగా ఉండటం లేదని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : 'ఉపాధి హామీ' రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా మే నెలలో పనిని కోరుతున్న కుటుంబాల సంఖ్య 3.07 కోట్లకు చేరుకున్నది. దేశంలో పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంఖ్య అత్యధికం కావటం గమనార్హం. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పని డిమాండ్ 2015-19 మధ్య ఐదేండ్ల సగటు కంటే 43 శాతం అధికంగా నమోదైంది. 2021లో ఉపాధి హామీ కింద పనిని కోరిన గృహాల సంఖ్య 2.7 కోట్లుగా ఉండగా, అంతకు ముందు ఏడాది 2.5 కోట్లుగా నమోదైంది. అయితే, భారత్లోని గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు ఆందోళనకరంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఆర్థికంగా వారి స్థితిగతులు ఏ మాత్రమూ బాగా లేవనీ, రుణాలూ వారికి భారంగా మారుతున్నాయని చెప్పారు.
ఉపాధి కింద దక్కేది కొంతే..!
ఉపాధి హామీ కింద లబ్దిదారులకు లభించే రోజువారీ వేతనంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద గ్రామీణ కుటుంబాలకు దక్కేది రూ. 209 మాత్రమే. ఇది నైపుణ్యం లేని మగ కార్మికుల సగటు రోజువారీ వేతనం రూ. 337తో పోలిస్తే తక్కువ అని అన్నారు. ఈ సూచనలు గ్రామీణ భారతంలో తీవ్రమైన బాధకు సంకేతమని నిపుణులు చెప్పారు.
'ఉపాధి'లో పురుషులు అధికం
మహమ్మారి కాలంలో దేశవ్యాప్తంగా వలసలు తీవ్రయ్యాయి. ఈ సమయంలో వలసకార్మికులకు తమ సొంత గ్రామాలకు తరలివెళ్లారు. అయితే, ఇప్పటికీ వారికి పని అందుబాటులో లేని కారణంగా వారు నగరాలకు తిరిగి వెళ్లటం లేదని నిపుణులు చెప్పారు. '' సాధారణంగా, ఉపాధి హామీ వంటి పథకాలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. కానీ, ఇప్పుడు పురుషులు కూడా క్యూలో ఉన్నట్టు కనిపిస్తున్నది'' అని ఈ పథకంపై అధ్యయనం చేస్తున్న బెంగళూరులోని అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్రన్ నారాయణన్ అన్నారు. ''ఏప్రిల్-మే లు ఉపాధికి గరిష్ట డిమాండ్ ఉన్న నెలలు. పథకం కింద డిమాండ్ చేసిన వ్యక్తి-రోజుల పని 32-34 శాతం తక్కువగా నివేదించింది'' అని ఆయన తెలిపారు. ఇతర సూచికలు కూడా గ్రామీణ ఆదాయాలు, డిమాండ్లు క్షీణించాయని సూచించాయి.
గ్రామీణ మార్కెట్ల వినియోగంలో క్షీణత
వినియోగంలో క్షీణత అన్ని జోన్లూ, పట్టణ తరగతులలో కనిపించింది. అయితే, ఇది గ్రామీణ మార్కెట్లలో మరింత తీవ్రంగా ఉన్నది. ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య గణాంకాల ప్రకారం అమ్మకాల పరిమాణంలో 5.3 శాతం క్షీణతను చూసింది. ఇది పట్టణ మార్కెట్లలో 3.2 శాతంగా ఉన్నది. గత మూడు త్రైమాసికాలలో ఇదే అతిపెద్ద వినియోగ మందగమనమని వినియోగదారుల పరిశోధన సంస్థ నీల్సన్ఐక్యూ తెలిపింది. ''గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అతి పేద కుటుంబాలలో క్షీణిస్తున్న ఆస్థి యాజమాన్యం, రుణాల పెరుగుదల, భూమి వంటి ఉత్పాదక ఆస్తులలో తక్కువ పెట్టుబడిని సూచిస్తున్నాయి'' అని ది నడ్జ్ సెంటర్ ఫర్ రూరల్ డెవలప్ంమెంట్ డైరెక్టర్ జాన్ పాల్ అన్నారు.
ఇటు గ్రామీణ భారత్ పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసింది. కానీ, రిజిస్ట్రేషన్ల సంఖ్య కొనుగోలు స్థాయిలో లేకపోవటం గమనార్హం. ఇటు ఏప్రిల్-మే లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు 2018 కంటే 21 శాతం ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ ఆదాయాలపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాలు ధాన్యాలు, నూనె గింజల అధిక ధరల నుంచి ప్రయోజనం పొందినప్పటికీ మొత్తం స్థాయిలో ఆదాయం ఎలా ఉన్నదో అస్పష్టంగానే ఉన్నది.
'మోడీ సర్కారు శ్రద్ధ చూపాలి'
మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో 'ఉపాధి హామీ' గ్రామీణ ప్రజలకు ఎంతగానో దోహదం చేసిందని నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేశారు. అయితే, ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. ఇందుకు గత బడ్జెట్ల ఈ పథకానికి జరిపిన కేటాయింపుల్లో కోతలే నిదర్శనమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ సర్కారు.. ఆ వైపుగా ఆలోచన చేయటం లేదని చెప్పారు. ఇప్పటికైనా గ్రామీణ భారత ఆదాయంపై మోడీ సర్కారు శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచించారు.