Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్ముతున్న మోడీ ప్రభుత్వం
- ఆ సంస్థలకు భూములిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే
- వాటిని తిరిగి రాష్ట్రానికే ఇచ్చేయాలి
- పెట్టుబడుల ఉపసంహరణ విరమించుకోవాలి:
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని ఆరు కేంద్రప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదనీ, వీటి విలువ రూ.40వేల కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణలోని హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎమ్టీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సిసిఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతున్నదని వివరించారు. ఈ ఆరు సంస్ధలకు గతంలో దాదాపు 7,200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం రూ.5 వేల కోట్లకు పైగా ఈ భూములు విలువ చేస్తాయనీ, బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ.40వేల కోట్ల ధర ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలనీ, లేకుంటే ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. ఈ మేరకు ఆదివారంనాడాయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసారు. ఆ భూముల్ని రాష్ట్రానికి ఇచ్చేస్తే తెలంగాణ సర్వతోముఖాభివద్ధికి దోహదపడే విధంగా వాటిని సద్వినియోగం చేసుకుంటామని వివరించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కై వే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదనీ, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడిదని ఆ లేఖలో ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని ఆయన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఆయా సంస్థల్ని పున్ణప్రారంభిస్తే అనేకమందికి ఉపాధి కల్పించవచ్చని సూచించారు.