Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల విద్యలో పడకేసిన పర్యవేక్షణ
- 594లో 16 మందే రెగ్యులర్ ఎంఈవోలు
- 64 డిప్యూటీఈవో పోస్టులు ఖాళీ
- 12 జిల్లాల్లోనే రెగ్యులర్ డీఈవోలు
- 21 జిల్లాలు, 55 మండలాలకు పోస్టులే లేవు
- దిగజారుతున్న విద్యాప్రమాణాలు
- విద్యాసంవత్సరం ప్రారంభమైనా సీఎం సమీక్ష లేదు
'తెలుగు రాష్ట్రాల్లోని మూడు, ఐదు, ఎనిమిది, పదో తరగతి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు తగ్గాయి. జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది'అని నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021 ప్రకటించింది.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పడిపోయాయి అని చెప్పడానికి నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021 నే నిదర్శనం. అయితే రెండేండ్లుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యారంగం కునారిల్లింది. విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. సర్కారు బడులను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో పాఠశాల విద్యాశాఖ లో పర్యవేక్షణ పడకేసింది. అంతా ఇన్ఛార్జీల తో కొనసాగుతున్నది. కొత్త విద్యాసంవత్సరం (2022-23) ఈనెల 13 నుంచి ప్రారంభమైంది. వారం రోజులు గడిచినా విద్యారంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. విద్యారంగం పరిస్థితి, ఉపాధ్యా యుల సమస్యలు, పర్యవేక్షణ వ్యవస్థ, విద్యార్థుల ఇబ్బందులు, సకాలంలో పుస్తకాలు, యూనిఫారాలు అందజేయడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడి' కార్యక్రమం సైతం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. తొలిదశలోని అన్ని బడుల్లోనూ పనులు ఇంకా ప్రారంభం కాలేదంటే అతిశ యోక్తి కాదు. ఇలా ప్రభుత్వ పాఠశాలలపై టీఆర్ఎస్ సర్కారు శీతకన్ను ప్రదర్శిస్తున్నది.
ఇంఛార్జీలతోనే పర్యవేక్షణ
విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 'మన ఊరు-మనబడి' పనుల పర్యవేక్షణ, పుస్తకాల పంపిణీ, యూనిఫారాలు అందించడం, ఉపాధ్యా యులు సకాలంలో విధులకు హాజరుకావడం, బోధన సక్రమంగా జరిగేలా విద్యాశాఖ అధికారులు దృష్టిసారించాలి. పాఠ శాలలను సందర్శించాలి. కానీ డీఈవోలు మొదలుకుని ఎంఈవోల వరకు కార్యాల యాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు న్నాయి. అయితే డీఈవో, డిప్యూటీఈవో, ఎంఈవో వంటి కీలకమైన పర్యవేక్షణ అధికారులస్థాయి పోస్టులన్నీ ఇంఛార్జీలతోనే కొనసాగుతుం డడం గమనార్హం. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం 594 మండలాల య్యాయి. ఇందులో 55 మండలాలకు మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులనే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. 539 ఎంఈవో పోస్టులకుగాను 523 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఎంఈవోలు 16 మందే ఉన్నారు. కొన్ని మండలాల్లో ఒకే ఎంఈవో రెండు నుంచి 12 మండలాల వరకు బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో 66 డిప్యూటీ ఈవో పోస్టులుంటే ఇద్దరే రెగ్యులర్ వారున్నారు. అంటే 64 డిప్యూటీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 33 జిల్లాలుంటే 12 మందే రెగ్యులర్ డీఈవోలు పనిచేస్తున్నారు. మిగిలిన 21 జిల్లాలకు ఇంఛార్జీ డీఈవోలే విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ వ్యవస్థ పడకేయడంతో విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నదని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆ కేసులను వెకేట్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వెక్కిరిస్తున్న ఉపాధ్యాయ ఖాళీలు
ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది. కానీ సర్కారు బడుల్లో సుమారు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఎలా అందుతుందన్న ప్రశ్న తలెత్తుతున్నది. 2019-20 విద్యాసంవత్సరంలో 15,661 మంది విద్యావాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా పనిచేశారు. కరోనా నేపథ్యంలో గత రెండు విద్యాసంవత్సరాలుగా వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఉపాధ్యాయ ఖాళీలున్నా విద్యావాలంటీర్ల నియామకాలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పిస్తామన్న విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ అమలుకు నోచుకోలేదు. పండితులు, పీఈటీ అప్గ్రెడేషన్ ప్రక్రియ పెండింగ్లోనే ఉన్నది. 5,571 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులనూ ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇలా అనేక సమస్యలతో టీచర్లు సతమతమవుతున్నారు. దీంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో వచ్చేనెలలో ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.