Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం
- రెండు నెలల్లో 57 ఏండ్ల పింఛన్ అమలు : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ జోగిపేట
'దేశంలో రూపాయి, సిపాయి విలువ తగ్గించడమే బీజేపీ నైజమని, 'అగ్నిపథ్'తో యువతను అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో తాలేల్మ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం, జోగిపేట పట్టణంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన లైబ్రరీ భవనాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఫైర్‌స్టేషన్ సమీపంలో బీసీ బాలికల హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. అందోల్ ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ నుంచి సంగుపేట ఎక్స్‌రోడ్ వరకు రోడ్డుకు ఇరువైపులా 2 వేల మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. నల్ల ధనం బయటకు తీసి ప్రతి ఎకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పి జన్‌దన్ ఖాతాలు తెరిపించి ఇప్పటి వరకు ఒక్క పైసా జమ చేయలేదని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపించారు. నల్ల వ్యవసాయ చట్టాలు తేవడంతో ఏడాది పాటు జరిగిన రైతు పోరాటంలో 750 మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని, 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్కటీ భర్తీ చేయలేదని తెలిపారు. మిలిటరీలో కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారని చెప్పారు. అగ్నిపథ్ పేరుతో బీజేపీ దేశంలో అగ్గి రాజేసిందన్నారు. దేశానికి సేవ చేసే సైనికులకు ఇస్త్రీ, కటింగ్ చేయించడం నేర్పుతామంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి నిరోధకంగా తయారయ్యారని చెప్పారు. ప్రాజెక్టులపై కేసులు పెట్టి అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణలో కాళేశ్వరానికి జాతీయ హౌదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రెండు నెలల్లో 57 వయసున్న అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు అవుతాయన్నారు. మంజీర నదిపై 15 చెక్ డ్యాములు రూ.122 కోట్లతో నిర్మించామన్నారు. దీంతో రైతులకు ఎల్లప్పుడూ నీరు సాగుకు అందుతుందన్నారు. కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ ఎ.శరత్, తాలేల్మ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం చైర్మెన్ జీ.లింగాగౌడ్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.