Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
- సోమవారం రాత్రి విద్యార్థులతో మంత్రి సబితారెడ్డి చర్చలు
నవతెలంగాణ-బాసర
సమస్యల పరిష్కారానికి బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ విద్యార్థులు ఎండనకా వాననకా నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. సోమవారం విద్యార్థుల దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. విడతలవారీగా విద్యార్థులు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా దీక్షలు కొనసాగించారు. ఆదివారం అర్ధరాత్రి విద్యార్థులు జాగరణ పేరుతో నిరసన వ్యక్తం చేశారు. దానికి స్పందించిన యూనివర్సిటీ డైరెక్టర్ సతీష్‌కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇతర అధికారులు విద్యార్థుల దగ్గరికి వెళ్లి సముదాయించారు. విద్యార్థులతో సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ప్రధాన సమస్యలను ముందుగా పరిష్కరించి మిగతా సమస్యలు విడతలవారీగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఉదయం జరిగే తరగతులకు విద్యార్థులు అందరూ హాజరు కావాలని సూచించారు. అయినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్, విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టు అధ్యాపకులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వీటిపై తమకు రాతపూర్వకంగా సీఎం కేసీఆర్, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, కేటీఆర్ హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని విద్యార్థులు అధికారులకు స్పష్టం చేశారు. విద్యార్థులు యోగా చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన..
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారే తప్ప రాతపూర్వకంగా హామీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీలో సమస్యలు తిష్టవేశాయని, వీటిపై యూనివర్సిటీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పట్టడం లేదని చెప్పారు. గత్యంతరం లేక శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా లాప్‌టాప్‌లు, యూనిఫామ్స్, బెడ్స్, తరగతి, వసతి గదుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. మిగతా సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు వివరించారు. విద్యార్థుల సమస్యలపై ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్జీయూకేటీ ఇన్చార్జి వైస్‌ఛాన్స్‌లర్ రాహుల్ బొజ్జా, డైరెక్టర్ సతీష్‌కుమార్ విద్యార్థులతో చర్చలు జరపనున్నారు. కాగా, సోమవారం రాత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు.