Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పంటపైనే రైతులకు అవగాహన
- ఇతర పంటలను పట్టించుకోని వ్యవసాయ శాఖ
- ఊహించని పరిణామాలు సంభవిస్తే...తీవ్ర నష్టమే...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తొలకరి పలకరించింది. విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటల పేరుతో సర్కారు పత్తి సాగుపైన్నే దృష్టి సారించింది. ఆ పంటపైన్నే రైతులకు అవగాహన కల్పిస్తున్నది. తెలంగాణా పత్తికి ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. మనది ఎంతో నాణ్యమైన పత్తి అంటూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రచారాన్ని ప్రారంభించారు. పంటల సమతుల్యత లోపించినప్పటికి సర్కారు పత్తిపాటే పడుతున్నది. ఆహారధాన్యాలు, పప్పుదినుసులు, పండ్లు, కూరగాయల పంటలకు అనువైన నేలలు ఉన్నప్పటికీ...రాష్ట్ర ప్రభుత్వం పట్టుపట్టి ఆ పంటనే సాగు చేయిస్తున్నది. ఈఏడాది సుమారు 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు కోటి 50 లక్షల సాగు భూమి ఉన్నది. సగానికి సగం భూమిలో పత్తి సాగు చేస్తే మిగతా భూముల్లో ఇతర పంటలు వేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పత్తి పంట సాగు చేయడం ద్వారా రైతులకు భరోసా ఉంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రాణాల మీదికి తెచ్చుకోవడమేనా?
వాణిజ్య పంటగా పేరొందిన పత్తి సాగుకు ఆదరణ బాగా ఉన్నది. ఆ పంట వేసుకుంటే పైసలొస్తాయనీ, తద్వారా ఎన్నో అవసరాలు తీరుతాయనే నమ్మకం రైతుల్లో పెరిగింది. దీంతో క్రమంగా పెద్ద రైతుల నుంచి ఎకరా, రెండెకరాలున్న సన్న, చిన్నకారు రైతులదాకా ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు.అయితే దాన్ని సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలెన్నో... ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో అత్యధికం పత్తి రైతులే ఉన్నట్టు అనేక నివేదికల్లో వెల్లడైంది. అందులోనూ కౌలు రైతులే అధికం. ఆ తర్వాత పత్తి పెట్టి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దంటూ వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది 2020-21లో పత్తికి మంచి ధర పలికింది. కానీ అధిక వర్షాలకు పంట దెబ్బతిన్నది. పూత, కాత దశలోనే పూర్తిగా నేలమట్టమైంది. దిగుబడి తగ్గిపోయింది. డిమాండ్ మేరకు దిగుబడి రాకపోవడంతో రికార్డు స్థాయిలో ధర పలికింది. దాన్ని చూపించి ఈసారి పంట వేయాలని సర్కారు చెప్పడం మేఘాలను చూసి చెలిమలో నీళ్లు తోడేయడమే అవుతుందంటూ రైతు నేతలు అభిప్రాయపడుతున్నారు.
నష్టపరిహారమేది?
వ్యవసాయ శాఖ ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న పత్తికి...పంటనష్టపరిహారాన్ని మాత్రం చెప్పడం లేదు. మరోవైపు 'వరి వద్దు...పత్తి ముద్దు' అనే స్థాయిలో సర్కారు ప్రచారం చేస్తున్నది. కానీ పత్తిసాగులో ఉహించని పరిణామాలు సంభవించి నష్టపోతే రైతు పరిస్థితి పరిస్థితేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత రెండేండ్లుగా అధిక వర్షాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో అత్యధికంగా పత్తి రైతులే ఉన్నారు.ఇప్పటికీ పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదు. మంత్రుల బృందం వరంగల్ జిల్లాల్లో పర్యటించి అనేక హామీలిచ్చింది. కానీ ఆ రైతులకు న్యాయం జరగలేదు. అన్ని పంటలను కాదని కేవలం పత్తి వేయడం వల్ల జరిగే పరిణామాలకు సర్కారు బాధ్యత వహిస్తుందా? అనే ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పడం లేదు. పత్తికి ఎరువుల వాడకం కూడా అధికంగా ఉంటుంది. హెక్టారుకు సుమారుగా 1100 కిలోల ఎరువులు వాడుతున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పంట మార్పిడి లేకుండా నిరంతంగా పత్తి సాగు చేయడంతో దిగుబడి తగ్గితున్నది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా ఉత్పత్తి ఖర్చు ఎకరాలకు రూ 11వేలు అవుతున్నది. క్వింటా పత్తి మద్దతు ధర రూ.6,080 నిర్ణయించింది.దీంతో సాగు ఖర్చుల కంటే తక్కువగా ఆదాయం వస్తున్నది.
ప్రత్యామ్నాయ పంటలు అంటే పత్తే కాదు
వరికీ ప్రత్యామ్నాయ పంట అంటే కేవలం పత్తి మాత్రమే కాదు. కందులు, మొక్కజొన్న. జొన్న, సజ్జలు, సోయాబీన్, వేరుశనగ, రాగులు,ఆముదాలు, పెసర, శనగ, పొద్దుతిరుగుడు ఇలాంటి పంటలు ఉన్నాయి. నిత్యం ఆహారంలో తీసుకునే పంటలివి. పండ్లు, కూరగాయాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ వీటి ఊసే ఎత్తడంలేదు. పండ్లు, కూరగాయాలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఆ పంటకు మద్దతు ధర ఉండదు. ప్రోత్సహముండదు. వాటిని పండిస్తే కొనే దిక్కు ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యత నుంచి తప్పించుకునేందుకే...
టి సాగర్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోళ్ల నుంచి తప్పించుకునేందుకే పత్తి పంటను సాగు చేయాలని చెబుతున్నది. ఆ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేస్తున్నది. కాబట్టి పత్తి పంటతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు.పైగా బహిరంగ మార్కెట్లో ఆ పంటకు ధర బాగా ఉన్నది. ఈ కారణం చెప్పి రైతులను అటువైపు మళ్లిస్తున్నది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. నూనే గింజలు, పండ్లు, కూరగాయాల పంటలకు నేలలు అనువైనవి. వాటిని ప్రోత్సహించాలి.