Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన
- రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్ మూర్తి సహా పలువురు అరెస్ట్
- భువనగిరిలో సీపీఐ(ఎం) నేతల అరెస్ట్
నవతెలంగాణ-ఓయూ/నేరేడ్మెట్
ఆర్మీలో నాలుడేండ్ల కాంట్రాక్టు రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దానిని రద్దు చేయాలని, సికింద్రాబాద్ ఘటనలో రాకేశ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న వారి అరెస్టులను ఖండించారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో, నేరేడ్మెట్ చౌరస్తాలో, నగరంలోని పలుచోట్ల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఓయూలో జరిగిన నిరసనలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్మూర్తి మాట్లాడుతూ.. అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగుల జీవితాల్లో మట్టికొట్టే నిర్ణయాలను ఖండిస్తున్నామని, కేంద్రం వాటిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లో ఆర్మీ అభ్యర్థులపై రైల్వే పోలీసుల కాల్పులు, లాఠీచార్జీని ఖండిస్తున్నామని చెప్పారు. ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్ష కార్యదర్శులు అంజనేయులు, రవి నాయక్, ఉపాధ్యక్షులు శ్రీను, మమత సహాయ కార్యదర్శి ఆనంత్ శర్మ, పవన్, కృష్ణ, నాయకులు అనిల్, అశ్విని, మనోజ్, రాకేశ్, నజీర్, నవీన్ పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి కన్నుకు, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అరెస్టయిన నాయకులు పోలీస్ స్టేషన్లో కూడా నిరసన తెలియజేశారు. కేంద్రం అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్మెట్ చౌరస్తాలో ధర్నా చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ క్రమంలో 11 మందిని పోలీసులు అరెస్టు చేసి, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అగ్నిపథ్ స్కీంను రద్దు చేయాలని నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భువనగిరిలో నాయకులను ఇండ్ల వద్దే పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి పట్టణంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజును వారి ఇండ్లలోకి వెళ్లి అరెస్టు చేశారు.