Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే జులై 7న హైదరాబాద్‌లో మహాధర్నా
- సీఎస్‌కు ధర్నా నోటీసు అందజేసిన యూఎస్పీసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేయాలనీ, లేదంటే జూలై ఏడో తేదీన హైదరాబాద్‌లో మహాధర్నా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూఎస్పీసీ హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నేతలు నోటీసును అందజేశారు. ఉపాధ్యాయులకు నాలుగేండ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా పదోన్న తులు, పదిహేడేళ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ కాక విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొందని యూఎస్పీసీ తెలిపింది. జీవో 158 ద్వారా క్లాసిఫై చేసిన పర్యవేక్షణాధికారులు, ఉపాధ్యాయ శిక్షణ అధ్యాపకుల పోస్టులను ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరింది. ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలనీ, అప్పటివరకు విద్యాబోధనకు ఆటంకం లేకుండా పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని సూచించింది. జీవో 317తో బాధితులైన ప్రతి ఉపాధ్యాయుడికీ న్యాయం చేయాలనీ, సీనియారిటీ, స్పెషల్ కేటగిరీ, భార్యాభర్తల సమస్యలపై పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లన్నంటినీ పరిష్కరించాలని డిమాండ్ చేసింది. అండర్ టేకింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించింది. అండర్ టేకింగ్ ఇవ్వని ఉపాధ్యాయుల దరఖాస్తులను హోల్డ్‌లో పెట్టి జీవో 402పై తుది తీర్పు వెలువడిన అనంతరం అవకాశం కల్పించాలని సూచించింది. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం స్వచ్ఛకార్మికులను, సర్వీసు పర్సన్లను ప్రత్యేక నియమించాలని విజ్ఞప్తి చేసింది. విద్యార్థులకు ఏకరూప దుస్తువులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది. వేసవి సెలవుల్లో ఎస్ఎస్సీ క్లాసులు, పరీక్షలు తదితర విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ 82 ప్రకారం ఈఎల్స్ ప్రిజర్వు చేయాలని కోరింది. వేతనాలను ఒకటో తేదీనే చెల్లించాలనీ, సప్లిమెంటరీ బిల్లులను వరుస క్రమంలో జాప్యం చేయకుండా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధుల పట్ల డీఎస్ఈ వ్యవహారశైలి మార్చుకోవాలనీ, డీఎస్ఈ కార్యాలయంలో సందర్శన వేళలను ప్రకటించాలని డిమాండ్ చేసింది. సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, డీఎస్ఈ కార్యాలయంలో రెండేండ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది.