Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ అజీజ్ పాషా
- మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ-అడిక్ మెట్
'బుల్డోజర్ సంస్కృతి' దేశానికి అత్యంత ప్రమాదకర మని, దీనిని అందరూ వ్యతిరేకించాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ, ఇన్సాఫ్ సంస్థ జాతీయ అధ్యక్షులు సయ్యద్ అజీజ్‌పాషా అన్నారు. దేశంలో ఇటీవల మైనారిటీలపై జరుగుతున్న దాడులను, 'బుల్డోజర్లు దిగుతాయి' అంటూ కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండటాన్ని నిరసిస్తూ సోమవారం అఖిల భారత తంజీమ్ -ఏ-ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్‌పాషా మాట్లాడుతూ.. ద్వేషాన్ని పెంచేలా.. మత రాజకీయాలను సుస్థిరం చేయడానికి కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు బుల్డోజర్లను ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నచ్చని లేదా ప్రశ్నించే మైనారిటీలపై దాడులు చేయడం, వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ సంస్కృతి కొనసాగుతోందని చెప్పారు. ఆరోపణలు చేసినా, విమర్శించినా, ప్రశ్నించినా నేరమైనట్టు అలా చేసిన వారి ఆస్తులను ధ్వంసం చేస్తుంటే దేశంలో ఇక న్యాయ వ్యవస్థ ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇటువంటి దాడులు, దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు, బీజేపీ పాలనా వైఫల్యాలు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. మైనారి టీలు తమ హక్కులపై ప్రశ్నిస్తే, నిరసనలు తెలిపితే పోలీసులు అణచివేతకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో యోగి సర్కార్ బుల్డోజర్ సంస్కృతిని అమలు చేస్తోందన్నారు. మైనారిటీల జీవించే హక్కులను ధ్వంసం చేయడం అంటే భారత రాజ్యాంగ విలువలను ధ్వంసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని, ప్రజా స్వామ్యాన్ని, లౌకిక విలువలను ధ్వంసం చేస్తూ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగి స్తోందన్నారు. ఇటువంటి చర్యలపై లౌకిక, ప్రజాసామ్యవాదులందరం ఏకమై ప్రతిఘటిస్తామని, రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్ పటేల్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు రంగాచారి, ఇన్సాఫ్ నాయకులు షంషుద్దీన్, గౌస్, ఎండి.సలీం తదితరులు పాల్గొన్నారు.