Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల సొమ్ముతో కొన్న భూములను ఎలా అమ్ముతారు? : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
నవతెలంగాణ - కరీంనగర్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం నిలిపివేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌భవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారుల నుంచి రూ.3 కోట్ల 36 లక్షలు సేకరించి, 66 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. మరో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని సుమారు 90ఎకరాల భూమిని సేకరించి ప్లాట్లు చేసిందన్నారు. అయితే, వివిధ కారణాల వల్ల ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టలేదని, లబ్దిదారుల్లో మాజీ సైనికులు కూడా ఉన్నారని, ఆ భూమిపై లబ్దిదారులు హైకోర్టులో కేసు కూడా వేశారని తెలిపారు. కానీ.. ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్ చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆ భూములను వేలం వేస్తున్నారని చెప్పారు. పూర్తిగా లబ్దిదారుల డబ్బుతో కొనుగోలు చేసిన భూమి నాడు రూ.2 కోట్ల విలువ చేయగా.. ప్రస్తుతం సుమారు వేయి కోట్లు ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నదని, అందులో రూ.46 వేల కోట్ల విలువ గల స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందని, వాటిని రాష్ట్రానికే చెందాలన్న మంత్రి కేటీఆర్ వాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. అయితే రాజీవ్ స్వగృహ కోసం కొనుగోలు చేసిన భూమిని ఎందుకు వేలం వేస్తున్నారని ప్రశ్నించారు. ఆ భూమి లబ్దిదారులకే చెందాలని, అలా కాని పక్షంలో ఐఐటీ లాంటి విద్యాసంస్థల ఏర్పాటుకు, ఐటీ రంగానికి ఉపయోగించాలన్నారు. లేదా లబ్దిదారులకు అందులో ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఆ భూమిని అప్పనంగా అమ్మాలనుకోవడం సరైంది కాదని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంచేశారు. పరిశ్రల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని తీసుకొని పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న నిబంధన ఉందని కేటీఆర్ వాఖ్యానించారన్నారు. ఆయన వాఖ్యలనుసారంగా రాజీవ్ స్వగృహ భూములు ఆ లబ్దిదారులకే చెందాలన్నారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు భూముల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సమద్ నవాబ్, ముక్క భాస్కర్, లింగంపల్లి బాబు, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.