Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల్లో ఒకరు నవవరుడు
- పత్తి విత్తనాలు నాటుతుండగా పిడుగులు
- రెండు ఎద్దులు కూడా మృత్యువాత
నవతెలంగాణ- కాగజ్నగర్ రూరల్, కౌటాల, దహెగాం
ఆసిఫాబాద్-కుమురంభీం జిల్లా సిర్పూరు నియోజకవర్గంలో సోమవారం పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. రెండు ఎద్దులు సైతం మృత్యువాత పడ్డాయి. మృతుల్లో ఒకరికి ఇటీవల వివాహం జరిగింది. కాగజ్నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన సాదుల సుమన్(28) గ్రామంలో పదెకరాల భూమి కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సోమవారం పత్తి విత్తనాలు నాటేందుకు భార్య అనూషతో కలిసి వెళ్లాడు. విత్తనాలు నాటుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం.. పిడుగు పడింది. దీంతో సుమన్, భార్య అనూష అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించి పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సుమన్ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అనూష చికిత్స పొందుతోంది. సుమన్-అనూషకు నెల రోజుల కిందటే వివాహం జరిగింది. సోమవారమే సుమన్ పుట్టిన రోజు కావడం, ఇదే రోజు మృతిచెందడంతో కుటుంబీకులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అంకుసాపూర్ గ్రామానికి చెందిన సెండె నానయ్య(40) తన మూడెకరాలతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పత్తి విత్తనాలు నాటేందుకు కుటుంబీకులతో కలిసి చేనుకు వెళ్లాడు. భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గొడ్డలి కోసమని సమీపంలోని చెట్టు వద్దకు నానయ్య వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కౌటాల మండలం వైగాం గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపడి సాద్గరి రేఖాబాయి (21) మృతిచెందింది. గ్రామ శివారులో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగు పడటంతో ఆమె చనిపోయింది. దహెగాం మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృత్యువాతపడ్డాయి. బోర్లకుంట గ్రామానికి చెందిన డోంగ్రె హౌక్టూ, ఇట్యాల గ్రామానికి చెందిన దుర్గం శంకరి ఎద్దులు పంట చేనులో ఉన్న సమయంలో పిడుగు పడటంతో చనిపోయాయి.