Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు ఆదేశాలను అమలు చేయాలి : కేటీఆర్ పర్యటనను రద్దు చేసుకోవాలని ఎల్గోయి రైతుల విజ్ఞప్తి
నవతెలంగాణ-ఝరాసంగం
'నిమ్జ్ ప్రాజెక్టుకు బలవంతంగా రైతులను బెదిరించి.. చట్టాలను ఉల్లంఘించి జీఓల పేరుతో తీసుకున్న భూములపై రైతులు, వ్యవసాయ కార్మికులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసులు వేశారు. రైతులకు, కూలీలకు న్యాయం చేయాలని, రైతుల భూముల్లోకి వెళ్లరాదని, కూలీలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా మంత్రి కేటీఆర్ ఏవిధంగా శంకుస్థాపనకు వస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రామ్‌చందర్ ప్రశ్నించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో నిమ్జ్ భూ బాధితులతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్జ్ పరిధిలోని రైతులను బెదిరించడం, చట్టాలను ఉల్లంఘించి చడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. నిమ్జ్ పరిధిలోని రైతులు కారా? అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 123ను కోర్టు రద్దు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏ విధంగా రైతుల భూములను పరిశ్రమలకు కేటాయిస్తారని విమర్శించారు. మంగళవారం శంకుస్థాపనకు వస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటనను రద్దు చేసుకోవాలని ఎల్గోయి గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భూ బాధితులు శంకర్, యేసయ్య, నర్సింలు, అంజమ్మ, మాణమ్మ, చంద్రప్ప, సిద్ధమ్మ, లక్ష్మప్ప, తుకారాం, రాములు తదితరులు పాల్గొన్నారు.