Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మట్టి గణపతుల తయారీపై సర్కార్ చర్యలు
- 30 కొలనులలో తగ్గిన కాలుష్యం
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ మహా నగరంలో వినాయక చవితి, నిమజ్జనాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహిస్తోంది. హుస్సేన ్సాగర్ సహా ఏ చెరువులోనూ ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో రూపొందించిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించేది లేదని గతేడాది హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, అతితక్కువ సమయంలో పీఓపీతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేమని, ఈ సారికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కోరడంతో గతేడాది హైకోర్టు అనుమతించింది. కానీ ఈసారి హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సర్కార్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఖైరతాబాద్‌లో 50 అడుగుల మట్టి వినాయకున్ని తయారు చేయడానికి నిర్ణయించింది.
3లక్షలకుపైగా..
హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏడాదీ కనీసం 3 లక్షలకుపైగా గణేష్ మండపాలు పెడుతున్నారు. 90 శాతం విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో తయారు చేసినవే ఉంటున్నాయి. ఈ విగ్రహాలను ట్యాంక్ బండ్ సహా ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా వాటి తయారీలో ఉపయోగించే జిప్సం, రసాయన కలర్లు, నీటిలోని టాక్సిన్ స్థాయిలను పెంచడం ద్వారా చేపలు సహా ఏ జీవమూ మనుగడ సాధించలేని పరిస్థితి నెలకొంది. ఈ పీఓపీతో తయారీని నియంత్రించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టింది.
50అడుగుల మట్టి విగ్రహం
ఖైరతాబాద్ గణేష్‌ను ఈసారి 50 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటిం చారు. ఇదేస్థాయిలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గణేష్ విగ్రహ తయారీదార్లను కూడా చైతన్యపర్చడం తోపాటు మట్టి వినాయక విగ్రహాల మార్కెటింగ్‌కు ప్రోత్సాహం కల్పించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రాష్ట్ర కాలుష్య నియంత్రణమండలి, బీసీ సంక్షేమశాఖలు తోడ్పడుతున్నాయి. సెప్టెంబర్‌లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఓపీతో విగ్రహాలు తయారు చేయకుండా తయారీదారులను చైతన్య పర్చాలని, గణేష్ పండుగ నిర్వాహకులకు కూడా అవగాహన, చైతన్యం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురు తయారీదారులు తాము మట్టితోనే విగ్రహాలు తయారు చేస్తున్నట్టు ప్రకటించారు.
30 కొలనులు
ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల జల కాలుష్యం ఏర్పడుతోంది. ఈ విషయంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ దాదాపు 30 గణేష్ నిమజ్జన కొలనులను నిర్మించింది. ఇటువంటి కొలనుల్లోనే 2021లో 70వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం చేశారు. దీంతో నగరంలోని చెరువుల్లో కాలుష్యం తగ్గేందుకు దోహదపడ్డాయి. ఈ నిమజ్జన కొలనులు నిర్మాణం బెంగళూరు తర్వాత కేవలం హైదరా బాద్ నగరంలోనే నిర్మించారు. నాలుగేండ్లుగా ఈ కొలనులో స్థానిక చిన్న విగ్రహాల నిమజ్జనం చేస్తూ, స్థానిక చెరువులలో చెయ్యకపోవడం గణనీయంగా కాలుష్య నివారణకు తోడ్పడుతున్నాయి. మరోవైపు గణేష్ నిమజ్జనం ముగియగానే ఒక్క హుస్సేన్‌సాగర్ నుండే 5800 టన్నుల పీఓపీ, ఇతర వ్యర్థాలను తొలగించారు.
మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి
గ్రేటర్లో మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి. హుస్సేన్‌సాగర్, చెరువుల్లో జలకాలుష్యం తగ్గించ డానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మట్టిపై ప్రజ లకు అవగాహన కల్పించడం, ప్రజల ను చైతన్యం చేయడానికి హైదరాబాద్ జిందాబాద్ కృషి చేస్తోంది.
- కె.వీరయ్య హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి